మెగాస్టార్, సూపర్‌స్టార్‌లతో సినిమా... బాబీ మాట ఇదే
డాకు మహారాజ్ సినిమా హిట్ అయితే చిరంజీవి, రజనీకాంత్ ఇద్దరూ వెంటనే బాబీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాను చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు బాబీ 2025 సంక్రాంతికి బాలకృష్ణతో కలిసి డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు బాబీ తన తదుపరి సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు. బాబీ తదుపరి సినిమా ఏంటి అనే విషయమై గత కొన్ని రోజులుగా జరుగుతున్న సస్పెన్స్‌కి తెర దించే విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్, సూపర్ స్టార్‌లతో సినిమాలు ఉండబోతున్నట్లుగా స్వయంగా బాబీ తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
వాల్తేరు వీరయ్య సినిమా సమయంలోనే చిరంజీవితో మరో సినిమా కన్ఫర్మ్ అయ్యిందని, ఆయనతో మళ్లీ వర్క్ చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమాను చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించాడు. రజనీకాంత్ కి కథ చెప్పిన విషయం నిజమే అన్నాడు, త్వరలోనే ఆ సినిమా ఉంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేశాడు. మొత్తానికి తన తదుపరి సినిమాలు చిరంజీవి, రజనీకాంత్‌లతో ఉండబోతున్నట్లు చెప్పాడు. అంతే కాకుండా తాను గతంలో చేసిన ఇతర హీరోలతోనూ సినిమాలు చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లు బాబీ పేర్కొన్నాడు.
డాకు మహారాజ్ సినిమా హిట్ అయితే చిరంజీవి, రజనీకాంత్ ఇద్దరూ వెంటనే బాబీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఇద్దరిలో ఏ హీరోతో సినిమా మొదట ఉంటుంది అనే విషయమై స్పష్టత లేదు. చిరంజీవి విశ్వంభర సినిమాను చేస్తున్నాడు, ఆ తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా ఉండబోతుంది. రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు సమాంతరంగా జరగబోతున్నాయి. బాబీతో సినిమాకు వచ్చే ఏడాది ద్వితీయార్థంలో చిరంజీవి డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
మరో వైపు రజనీకాంత్ సైతం కూలీ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్‌లో ఉంచాడు, రెండు సినిమాల కంటే ముందు బాబీతో సినిమా చేసే అవకాశాలు లేవు. బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ సినిమా ఫలితాన్ని బట్టి ఇతర హీరోలు సైతం బాబీ కి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి బాబీ తన దృష్టి మొత్తం డాకు మహారాజ్ సినిమాపైనే ఉందని, తర్వాత సినిమా విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకోలేను అంటూ చెప్పుకొచ్చాడు. అతి త్వరలోనే బాబీ కొత్త సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన వస్తుందేమో చూడాలి. చిరంజీవి, రజనీకాంత్‌లతో తన సినిమాలు ఉంటాయి, అవి ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేను అన్నట్లుగా బాబీ చెప్పుకొచ్చాడు.