వరుసగా ఏడుసార్లు 200 కోట్ల క్లబ్ హీరో!
అమీర్ ఖాన్ లాంటి స్టార్ 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడానికి రెండు దశాబ్ధాలు పైగానే పట్టింది. ఖాన్‌ల త్రయం చాలా కాలం పోరాడాకే వంద కోట్ల క్లబ్ లో అడుగుపెట్టారు;
అమీర్ ఖాన్ లాంటి స్టార్ 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడానికి రెండు దశాబ్ధాలు పైగానే పట్టింది. ఖాన్‌ల త్రయం చాలా కాలం పోరాడాకే వంద కోట్ల క్లబ్ లో అడుగుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్లు తమను తాము నిరూపించుకుని కొన్నేళ్ల పాటు చాలా దూరం ప్రయాణించాకే 100కోట్ల క్లబ్‌లు అందుకున్నారు. ఇప్పుడు మన స్టార్లు 200 కోట్ల క్లబ్‌ని సునాయాసంగా అందుకుంటున్నారు.
అయితే ఒకటి.. రెండు లేదా మూడు సార్లు వరుసగా 200కోట్ల క్లబ్‌లు అందుకోవడం సాధ్యమే కానీ, ఈ స్టార్ హీరో వరుసగా ఏడుసార్లు 200 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం నిజంగా ఒక అరుదైన రికార్డ్. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వీళ్లెవరికీ సాధ్యం కానిది తాను సాధించి చూపించాడు. ఈ రికార్డును భారతీయ సినిమా హిస్టరీలో మరొక నటుడు అందుకుంటాడో లేదో చెప్పలేం.
కానీ ఈ ఫీట్ ని సాధించిన ఏకైక నటుడిగా దళపతి విజయ్ రికార్డులకెక్కాడు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత లాభదాయకమైన, సుస్థిరమైన స్టార్లలో ఒకరిగా విజయ్ వెలిగిపోతున్నాడు. అతడు నటించిన చివరి ఏడు చిత్రాలు ఒక్కొక్కటి బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల మార్కును అధిగమించాయి. తద్వారా అతడు తమిళ సినీపరిశ్రమలో ఎదురేలేని శక్తిగా పేరు సంపాదించాడు.
ప్రఖ్యాత జీక్యూ వివరాల ప్రకారం.. విజయ్ రికార్డు స్థాయి విజయాల పరంపర మెర్సల్ (2017) తో ప్రారంభమైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా రూ. 220 కోట్లు వసూలు చేసింది. సర్కార్ (2018) తో కూడా ఈ ఊపు కొనసాగింది. ఈ చిత్రం దాదాపు రూ. 252 కోట్లు వసూలు చేసింది. బిగిల్ (2019) తో బాక్సాఫీస్ వద్ద మరోసారి 200కోట్ల క్లబ్ సాధించాడు. ఈ చిత్రం రూ. 295 కోట్లు వసూలు చేసింది. కరోనా మహమ్మారి కూడా కలెక్షన్లను ఆపలేకపోయింది. ఆ తర్వాత మాస్టర్ (2021) సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నప్పటికీ రూ. 223 కోట్లు ఆర్జించింది. ఆ తర్వాత బీస్ట్ (2022) తో రూ. 216 కోట్లు సాధించాడు. తరువాత వరిసు (2023) వచ్చింది. ఈ చిత్రం పొరుగు భాషల్లో అంతగా ప్రశంసలు పొందక పోయినా రూ. 297 కోట్లు వసూలు చేసింది. విజయ్ నటించిన రీసెంట్ మూవీ `లియో` (2023) ఇప్పటివరకు తన కెరీర్ లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్, త్రిష వంటి అగ్రతారలు నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ దేశీయంగా రూ. 300 కోట్లు అధిగమించగా, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్లు వసూలు చేసింది.
లియోతో విజయ్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడయ్యాడు. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ వచ్చినా మినిమం 100-150 కోట్ల ఓపెనింగు వసూళ్లు తేగలడనే భరోసా ట్రేడ్ కి ఉంది. రొటీన్ సినిమా అని టాక్ వచ్చినా ది గోట్ కూడా 200 కోట్ల క్లబ్ ని అధిగమించింది. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. విజయ్ తదుపరి జననాయకుడు (జన నాయగన్ -తమిళం) అనే చిత్రంలో నటిస్తున్నాడు. తన రాజకీయ ఆరంగేట్రానికి ముందు విజయ్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.