పెంచుకోవాల్సింది ప్రేమనే..

Update: 2017-11-25 06:46 GMT
సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో వస్తున్న భారీ చారిత్రక చిత్రం పద్మావతి దేవి ఇంకా వివాదాల చిక్కుముళ్ల నుంచి బయటకు రాలేదు. రాణి పద్మావతి చరిత్రను వక్రీకరించాడంటూ మొదలైన ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరడంతో చివరకు ఆ మూవీ రిలీజ్ ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ విషయంలో కొందరు మరీ శృతిమించి హీరోయిన్ తలలు నరికేస్తామనే దాకా వెళ్లారు.

ఇలాంటి విషయాల్లో విద్వేషంతో సాధించేది ఏమీ ఉండదని బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ అంటోంది. ‘‘మనం ఉన్న సమాజంలో ప్రేమ.. మానవత్వం పెంచుకోవాలి. వాటికి భంగం కలిగించే అంశాలన్నిటిని వదిలేయడం మంచిది. ప్రేమతో ఏం సాధించగలమో ఓ బిడ్డకు తల్లినయిన నాకు బాగా తెలుసు’’ అని చెప్పుకొస్తోంది. ఈ సినిమాపై మొదలైన వివాదం విషయంలో డైరెక్టర్ భన్సాలీకి తన మద్దతు ఉంటుందని చెబుతోంది. ‘‘భన్సాలీకి నా సపోర్ట్ ఉంటుందని పనిగట్టుకుని చెప్పాల్సిన పని లేదు. దానికి ఓ వేదిక అంతకన్నా అవసరం లేదు. నన్ను నటిగా.. వ్యక్తిగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి ఆయన. నా సపోర్ట్ ఉంటుందన్న విషయం భన్సాలీకి తెలుసు’’ అంటూ తన డైరెక్టర్ భన్సాలీ పట్ల తన గౌరవాన్ని చాటుకుంది.

సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో రాణి ముఖర్జీ బ్లాక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నటిగా రాణి ముఖర్జీకి చక్కటి పేరు తెచ్చిపెట్టింది. బాలీవు్డ్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకున్నాక నటనకు దూరంగా ఉంది. తమ ఇంట్లో అసలు సినిమాల విషయమే మాట్లాడుకోమని.. కేవలం తమ కూతురుకు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటామని ఈ నీలికళ్ల సుందరి చెబుతోంది.
Tags:    

Similar News