వీడియో: ఓవర్సీస్ కోసం RRR స్పెషల్ ఇంటర్వ్యూ..!

Update: 2022-03-22 14:13 GMT
సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న RRR విడుదల తేదీ దగ్గర పడింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాని మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాలతో ఫుల్‌ బిజీగా గడుపుతోంది.

'ఆర్‌.ఆర్‌.ఆర్‌' హీరోలతో కలిసి జక్కన్న ఓ రేంజ్‌ లో మూవీని ప్రమోట్‌ చేస్తున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ప్రమోషనల్ ఈవెంట్స్‌ ను నిర్వహించారు. ఓవర్ సీస్ లో తెలుగు వాళ్లే కాకుండా ఇతర భాషల వారు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యూఎస్ లో సరిగమప సినిమాస్ మరియు రాఫ్తార్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు 1150కి పైగా స్క్రీన్ లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అక్కడ మార్చి 24న RRR ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇప్పటికే ప్రీ బుకింగ్ సేల్స్ ద్వారా 2 మిలియన్ల డాలర్లకు పైగా వసూళ్ళు వచ్చాయి.

ప్రీమియర్స్ కు మరింత ఊపు తీసుకురావడానికి ఓవర్ సీస్ లోనూ ఈక్వల్ గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడి ఆడియన్స్ కోసం ట్రిపుల్ ఆర్ టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. రాజమౌళితో పాటుగా తారక్ - చరణ్ లు ఇందులో పాల్గొన్నారు.

ఓవర్ సీస్ లో అత్యధిక స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కాబోతోందని.. అత్యుత్తమ అనుభవం కోసం భారతదేశపు అతిపెద్ద యాక్షన్ డ్రామా RRR ప్రీమియం ఫార్మాట్లలో ఎక్సపీరియన్స్ చేయమని చెబుతూ చిత్ర విశేషాలు వెల్లడించారు.

దేశ విదేశాల్లో సినిమాని ప్రమోట్ చేయడం సినిమాలో భాగమేనని.. అది కష్టంగా అనిపించదని ఈ సందర్భంగా రాజమౌళి పేర్కొన్నారు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ లను హ్యాండిల్ చేయడం అంతకంటే కష్టమని అన్నారు. రికార్డుల గురించి తాను ఆలోచించని.. అవి వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుందని తెలిపారు.

RRR చిత్రానికి ఇక్కడ ఉండే హంగామా ఓవర్ సీస్ లోనూ ఉందని.. ఏమాత్రం తగ్గడం లేదని ఎన్టీఆర్ అన్నారు. అయితే ఇంతవరకు విదేశీ థియేటర్లలో తెలుగు సినిమాని చూడలేదని.. ఒక్కసారి అది ఎక్సపీరియన్స్ చేయాలన్నారు. పాండమిక్ వల్ల వాయిదా పడిన తర్వాత క్రేజ్ తగ్గుతుందని భయపడ్డానని.. కానీ ఇప్పుడు అక్కడ క్రేజ్ రెండింతలు రెట్టింపు అయ్యిందని తెలిపారు.

ఓవర్ సీస్ లో క్రేజ్ వేరేలా ఉంటుందని.. ఫ్యాన్స్ ఉత్సాహంతో చేసే హంగామా చూసినప్పుడు సంతోషంగా అనిపిస్తుందని రామ్ చరణ్ పేర్కొన్నారు. సరదా సరదా మాటలతో ఆసక్తికరమైన విశేషాలతో సాగిన RRR టీమ్ ఓవర్ సీస్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.

కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఆలియా భట్ - ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించారు. అజయ్ దేవగన్ - శ్రీయా - సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. అలిసన్ డూడీ - రే స్టీవెన్సన్ వంటి హాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగమయ్యారు.

తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో 'ఆర్.ఆర్.ఆర్' మూవీ రిలీజ్ అవుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు.



Full View
Tags:    

Similar News