సాయిపల్లవి.. ప్రేమమ్ స్టయిల్లో

Update: 2018-06-15 06:20 GMT
‘ప్రేమమ్’ సినిమాలో సాయిపల్లవి వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. తన స్టూడెంటునే ఇష్టపడి అతడి ప్రేమలో మునిగిపోయే యంగ్ లెక్చరర్ పాత్రలో ఆమె కట్టిపడేసింది. కోట్లాది మందికి ఆరాధ్య దేవతగా మారిపోయింది. ఒక కథానాయికకు అలాంటి పాత్ర దక్కడం అరుదు. అందులో హీరోతో ప్రేమ ముదిరి పాకాన పడ్డ సమయంలో సాయిపల్లవికి యాక్సిడెంటై చివరి ఏడాదిలో జరిగిందంతా మరిచిపోతుంది. హీరో వస్తే అతడిని కనీసం గుర్తు పట్టదు. అందులో ఆ సన్నివేశాన్ని చాలా హృద్యంగా తెరకెక్కించాడు దర్శకుడు. సినిమాలో చాలా బలంగా అనిపించే సీన్ అది. విశేషం ఏంటంటే.. సాయిపల్లవి మళ్లీ ఈ టైపు క్యారెక్టర్ ఒకటి చేస్తోందట. అది కూడా తెలుగులో అంటున్నారు.

ప్రస్తుతం సాయిపల్లవి శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి రూపొందిస్తున్న ‘పడి పడి లేచే మనసు’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘లై’తో యాక్షన్ ట్రై చేసి బోల్తా కొట్టిన హను.. ఈసారి ప్యూర్ లవ్ స్టోరీ ట్రై చేస్తున్నాడట. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్ అనుకోకుండా తన గతం మరిచిపోతుందట. హీరోతో ప్రేమ సంగతి కూడా ఆమెకు గుర్తుండదట. ఆ స్థితిలో హీరో ఆమెలో మార్పు తెచ్చి.. తన గురించి తెలిసేలా చేసే ప్రయత్నంలో ఉంటాడట. ఈ నేపథ్యంలో కథ మంచి ఫీల్ తో సాగుతుందట. ఈ చిత్రం కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. చిత్రీకరణ ఎక్కువ శాతం అక్కడే చేస్తున్నారు. కొత్త నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. హను ఎప్పట్లాగే నెమ్మదిగా ఈ చిత్రాన్ని చెక్కుతున్నాడని.. ముందు అనుకున్నట్లు దసరాకు ఈ చిత్రం విడుదల కాదని అంటున్నారు.
Tags:    

Similar News