రియల్ ఛాలెంజ్ మొదలుపెట్టిన కండలవీరుడు!

Update: 2020-04-29 06:32 GMT
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో షూటింగ్స్ అన్నీ ఆగిపోయి.. సినిమాపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అయితే రోజూవారీ వేతన కార్మికులను ఆదుకునేందుకు టాలీవుడ్‌లో స్టార్స్ ముందుకు వచ్చినట్లే బాలీవుడ్‌ లోనూ స్టార్స్ అందరూ ముందుకు వచ్చారు. దాదాపు స్టార్ హీరోలందరూ భారీ మొత్తంలో ప్రజలను.. తమ సినిమాలకు పనిచేసే కార్మికులను ఆదుకునేందుకు విరాళంగా ఇచ్చారు. ఇక సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే బీయింగ్ హ్యూమన్ అనే సంస్థ నుంచి ఎంతో మందికి ఆర్థిక సాయం చేస్తున్నారు. దేశంలో విప‌త్క‌ర ప‌రిస్థుతులు ఎదుర్కుంటున్న స‌మ‌యంలో తనకి తోచిన విధంగా సాయం చేస్తూ త‌న మంచి మ‌న‌సు చాటుకుంటున్నాడు సల్మాన్. ఇప్పటికే 25వేల మంది సినీ కార్మికులకు ఆర్థిక సాయం చేస్తానని సల్మాన్‌ ఖాన్ ప్రకటించాడు. ఒకేసారి పూర్తి మొత్తం ఇస్తే అనవసరంగా ఖర్చు అవుతుందని భావించిన సల్మాన్.. పలు విడతల్లో వారికి సాయం చేసారు. అందులో భాగంగా తొలి విడతలో పేద సినీ కార్మిక కుటుంబాలకి రూ.3 వేలు అందించిన స‌ల్మాన్.. రెండో నెల‌కు కూడా నిధులు విడుద‌ల చేసాడు. అంటే 25 వేల మందికి ఇప్ప‌టిదాకా ఒక్కొక్క ఫ్యామిలీకి రూ.6 వేల చొప్పున ఇచ్చాడు. ఇలా మొత్తం స‌ల్మాన్ నుంచి రూ.15 కోట్ల సాయం అందించాడు.

ఇదిలా ఉండగా ఇప్పుడు మన టాలీవుడ్ లో 'బి ది రియల్ మ్యాన్' అనే ఛాలెంజ్ ట్రెండ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన మన సెలబ్రెటీలు ఇంటి పనుల్లో సహాయం చేస్తే రియల్ మ్యాన్ అనిపించుకుంటారు అంటూ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా బాలీవుడ్ లో కూడా ఒక సరికొత్త ఛాలెంజ్ ను సల్మాన్ ఖాన్ మొదలు పెట్టి తన ఉదారతను చాటుకున్నారు. అయితే మన సెలబ్రెటీల ఛాలెంజ్ లా కాకుండా ప్రజలకు ఉపయోగపడే ఛాలెంజ్ కి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆహార కొరతతో బాధ పడుతున్న నిరుపేదలకు భారీ సహాయాన్ని అందించాడు. మొత్తం 1 లక్ష 25 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి సల్మాన్ ఇప్పటి నుంచి ఇది కూడా ఒక ఛాలెంజే అని అందులో భాగమే ఈ 'అన్న దానం' అంటూ ట్వీట్ చేసారు. అందరూ ఈ 'అన్నదానం' ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయమని కోరాడు. కరోనా బాధితులను ఆడుకోడానికి 'అన్నదానం' అనే ఛాలెంజ్ తీసుకొచ్చిన సల్లూభాయ్ ని అందరూ అభినందిస్తున్నారు.
Tags:    

Similar News