అఫీషియల్: 400 కోట్ల రోబో-2

Update: 2015-12-17 04:58 GMT
రాజమౌళి ‘బాహుబలి’ రెండు భాగాలకు కలిపి రూ.250 కోట్ల బడ్జెట్ అంటేనే ఆశ్చర్యపోయాం. శంకర్ ఒక్క సినిమాకే రూ.400 కోట్లు ఖర్చు పెట్టించేయబోతున్నాడిప్పుడు. రోబో-2 బడ్జెట్ ఇది. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కు కూడా దిమ్మదిరిగిపోయేలా చేస్తున్న ఈ ఫిగర్ రూమర్ అయ్యుంటుందని అనుకోకండి. స్వయంగా రోబో-2 తెలుగు వెర్షన్ కి పీఆర్వోగా వ్యవహరించబోతున్న బి.ఎ.రాజు ఈ విషయాన్ని ప్రకటించారు. మొన్నటి దాకా రోబో-2 బడ్జెట్ రూ.300 కోట్లంటేనే ఔరా అనుకున్నాం. దానికి ఇంకో వంద యాడ్ చేసుకుని రంగంలోకి దిగుతున్నాడు శంకర్. హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ లేకుండానే ‘రోబో-2’ మీద ఇంత బడ్జెట్ పెడుతున్నారంటే.. అతను కూడా ఉంటే ఇంకో వంద కోట్లు కలుపుకోవాల్సి వచ్చేదేమో.

రోబో సీక్వెల్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలను బి.ఎ.రాజు వెల్లడించారు. ఈ మూవీ టైటిల్ రోబో-2 కాదు, జస్ట్ ‘2.0’ మాత్రమే. దీనికి ‘సీక్వెల్ ఆఫ్ రోబో’ అనేది క్యాప్షన్. ఈ మూవీని త్రీడీలో తెరకెక్కించబోతున్నారు. శంకర్ కు ఇదే తొలి త్రీడీ ఫిలిం. లైకా ప్రొడక్షన్ సింగిల్ గానే ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. రజినీకాంత్ తొలి రోజు సైంటిస్ట్ గెటప్పులో (రోబోలో వశీ గుర్తున్నాడుగా) షూటింగులో పాల్గొన్నాడు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. అమీ జాక్సన్ కథానాయిక. రెహమాన్ సంగీత దర్శకుడు. ‘సైజ్ జీరో’కు ఛాయాగ్రహణం అందించిన బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ఛాయాగ్రహణం అందించబోతున్నాడు. ‘రోబో’కు రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించిన సంగతి తెలిసిందే. జురాసిక్ పార్క్ - ఐరన్ మ్యాన్ - ఎవెంజర్స్ లాంటి సినిమాలకు యానిమాట్రిక్స్ టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చిన ‘లెగసీ ఎఫెక్ట్స్’ రోబో-2కు పని చేయబోతోది. రోబో - బాహుబలి సినిమాలకు పని చేసిన శ్రీనివాస్ మోహన్ వీఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ గా వ్యవహరించబోతున్నాడు.
Tags:    

Similar News