బాహుబలికి ఇంకో డైరెక్టరున్నాడు

Update: 2015-07-05 11:30 GMT
తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ దర్శకత్వం వహించిన 'రాజన్న' సినిమాలో యాక్షన్‌ సన్నివేశాల వరకు రాజమౌళే డైరెక్ట్‌ చేసిన సంగతి తెలిసిన విషయమే. ఐతే తండ్రికి తనైతే సాయం చేశాడు కానీ.. తన సినిమాల విషయంలో రాజమౌళి ఇంకొకరిని వేలు పెట్టనిస్తాడని ఎవరూ అనుకోరు. ఎందుకంటే రాజమౌళి తన సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని తనే దగ్గరుండి చూసుకుంటాడని అతడితో కలిసి పని చేసిన వాళ్లు చెబుతుంటారు. ఐతే ఒక్క బాహుబలి విషయంలో మాత్రం రాజమౌళి కొంచెం కాంప్రమైజ్‌ అయ్యాడట. ఐతే అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే. మొత్తం సినిమాలో ఓ పదిశాతం రాజమౌళి డైరెక్ట్‌ చేయలేదట. వేరే వ్యక్తి ఆ సన్నివేశాలు తీశాడట.

మామూలుగా ఐతే ఇది పుకారే అనుకుంటాం కానీ.. స్వయంగా ప్రభాసే ఆ మాట అన్నాక నమ్మి తీరాల్సిందే కదా. ఆ పది శాతం డైరెక్ట్‌ చేసిన వ్యక్తి మరెవరో రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ. తనే పరిస్థితుల్లో డైరెక్ట్‌ చేయాల్సి వచ్చిందో ప్రభాస్‌ వివరించాడు. ''బాహుబలి సినిమాకు సంబంధించి రాజమౌళి ఫ్యామిలీ అంతా విపరీతంగా కష్టపడింది. కార్తికేయ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువ. సినిమాకు అతనే మెయిన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌. అన్నీ తానై వ్యవహరించాడు. కొన్నిసార్లు రెండు మూడు యూనిట్లతో వేర్వేరుగా షూటింగ్‌ చేసేవాళ్లం. అలాంటపుడు ఒకటి రెండు చోట్ల రాజమౌళి చూసుకనేవాడు. ఇంకోచోట కార్తికేయనే డైరెక్షన్‌ చేసేవాడు. ఐతే అది రాజమౌళి సలహాల మేరకే. ఇలా సినిమా మొత్తంలో ఓ పది శాతమైనా కార్తికేయ డైరెక్ట్‌ చేసి ఉంటాడు'' అని చెప్పాడు ప్రభాస్‌.

Tags:    

Similar News