జగపతిబాబు పాత్ర సీక్రెట్ చెప్పిన సుక్కు

Update: 2018-04-13 05:47 GMT
‘రంగస్థలం’లో కథాకథనాలు మామూలుగానే అనిపించినప్పటికీ.. అందులో పాత్రలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. హీరో తర్వాత ప్రేక్షకుల్ని ఎక్కువగా మెప్పించింది జగపతిబాబు చేసిన ప్రెసిడెంట్ పాత్రే. ఇప్పటికే ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసిన జగపతి.. ఈ క్యారెక్టర్ తో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్.. హావభావాలతో ఆ పాత్రను అద్భుతంగా పండించాడు. ఈ క్యారెక్టర్‌ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని జగపతిబాబు.. సుకుమార్ కలిసి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుకుమార్ ఆ సీక్రెట్ జనాలకు చెప్పాలనే అనుకోలేదట. కానీ ఆ విషయం జనాలకు తెలియాలంటూ జగపతే దాన్ని బయటపెట్టాడు. సుక్కుతో దాని గురించి వివరణ ఇప్పించాడు.

ఒక పామును దృష్టిలో ఉంచుకుని ఈ పాత్రను డిజైన్ చేశాడట సుకుమార్. పాము అనేది ప్రమాదకరమైందని.. కానీ పల్లెటూళ్లలో పామును చంపడానికి అందరూ భయపడతారని.. దాన్ని పూజిస్తారని.. సరిగ్గా ఈ ఛాయలే ప్రెసిడెంటు పాత్రలో కనిపిస్తాయని సుకుమార్ వెల్లడించాడు. జగపతి కళ్లను పాము కళ్లలాగా చూపించడం గమనించవచ్చని.. అలాగే ఊర్లో అందరూ అతడిని దేవుడిలా కొలుస్తారని.. అతను ప్రమాదకరం అని తెలిసినా ఎవ్వరూ అతడి జోలికి వెళ్లరన్నాడు. పాము తన గుడ్లను తాను తిన్నట్లే తన అసిస్టెంటును జగపతి తానే చంపేస్తాడని.. చివర్లో ఒక కలుగులో పాము తల దాచుకున్నట్లుగా అతను కూడా వెళ్లి ఒక గుడిసెలో పాము తరహాలోనే పడుకుని ఉంటాడని.. పాము కాటేసినట్లే చరణ్ మీద ఆటాక్ చేస్తాడని.. ఆ తర్వాత చరణ్ పామును కొట్టినట్లే అతడిని కొడతాడని.. ఇలా మొత్తంగా పాము తరహాలోనే ఆ పాత్ర ఉంటుందని సుకుమార్ ఆసక్తికర సంగతులు వెల్లడించాడు. సుకుమార్ ఎంత విలక్షణంగా ఆలోచిస్తాడో చెప్పడానికి ఇది మరో ఉదాహరణగా చెప్పొచ్చు.


Tags:    

Similar News