స‌న్నాఫ్ ష్రాఫ్ కష్టాల క‌థ‌ విన్నారా?

Update: 2019-09-05 01:30 GMT
స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి క‌ష్టాల్లా స‌న్నాఫ్ ష్రాఫ్ క‌ష్టాల క‌థేమిటో! అక్క‌డ బిజినెస్ లో న‌ష్టాలు వ‌చ్చి స‌త్య‌మూర్తి కొడుకు క‌ష్టాల పాల‌వుతాడు. ఉన్న ఇల్లు అమ్మేసి అద్దె ఇల్లు వెతుక్కుంటాడు. అచ్చం అలా కాక‌పోయినా ఇంచుమించు అలాంటి క‌ష్టాలే అనుభ‌వించాడు జాకీష్రాఫ్ త‌న‌యుడు టైగ‌ర్ ష్రాఫ్. ఒక్క‌సారి అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిన టైగ‌ర్ 11 ఏళ్ల వ‌య‌సులో త‌న‌ గ‌తాన్ని ఒక‌సారి గుర్తుకు తెచ్చుకుని తీవ్ర‌ క‌ల‌త‌కు గుర‌య్యాడు.

ప‌ద‌కొండు ప్రాయంలో ఉన్న‌ప్పుడు మా అమ్మా నాన్న ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులవి. 2003లో బూమ్ (అమితాబ్-క‌త్రిన) సినిమా రిలీజైంది. ఆ సినిమాని మా అమ్మ‌గారు అయేషా ష్రాఫ్ నిర్మించారు. ఆ సినిమా థియేట‌ర్ల‌లోకి రాక‌ముందే ఆన్ లైన్ లో లీకైపోయింది. దాంతో అది పెద్ద ఫ్లాపై మా కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. అప్ప‌ట్లోనే ఓ సంఘ‌ట‌న నాకు గుర్తుంది. నా ముందే ఇంట్లో ఉన్న ఫ‌ర్నీచ‌ర్ అంతా ఒక‌టొక‌టిగా అమ్మేస్తున్నారు నాన్న‌. క‌ళ్ల ముందే అన్నీ పోతున్నాయి. చివ‌రికి నేను నిదురించే బెడ్డును కూడా అమ్మేశారు. దాంతో నేల‌పై ప‌డుకున్నాను.. ఆ స‌న్నివేశం అలా క‌ళ్ల ముందే ఉండిపోయింది.. అని తెలిపారు టైగ‌ర్. బ‌హుశా ఆ రోజే టైగ‌ర్ కి క‌ష్టం అంటే ఏమిటో తెలిసింది కాబ‌ట్టే ఇప్పుడిలా ఇంత‌గా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడ‌ని భావించ‌వ‌చ్చు.

అఫ్ కోర్స్ ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఇలాంటివి ఉంటాయి. కానీ ఆ రోజు ఆ ఘ‌ట‌న త‌న‌లో ఎంత ప‌ట్టుద‌ల నింపిందో ఇప్పుడు అభిమానుల‌కు అర్థ‌మ‌వుతోందనుకోండి. బాలీవుడ్ లో ఉన్న న‌వ‌త‌రం స్టార్ల‌లో ఎంతో హార్డ్ వ‌ర్కర్ గా టైగ‌ర్ కి పేరుంది. అత‌డి క‌మిట్ మెంట్ అంద‌రికీ షాకిస్తుంటుంది. యాక్ష‌న్ హీరోగా నిరూపించుకునేందుకు అంత క‌ష్ట‌ప‌డుతున్నాడు అంటే గ‌తం అంత భ‌యంక‌ర‌మైన‌ది అని కూడా అర్థమ‌వుతోంది. హీరో పాంటీ అనే సినిమాతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అయిన టైగ‌ర్ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్ష‌న్ హీరో అంటే టైగ‌ర్ ష్రాఫ్ అనేంత‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ ఏడాది ఆరంభ‌మే టైగ‌ర్ క‌థానాయ‌కుడిగా పునీత్ మ‌ల్హోత్రా తెర‌కెక్కించిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2` రిలీజైంది. ప్ర‌స్తుతం `భాఘి 3` సెట్స్ పై ఉంది. అలాగే హృతిక్ తో క‌లిసి న‌టించిన‌ `వార్` అక్టోబ‌ర్ 2న రిలీజ‌వుతోంది. ఈలోగానే తదుప‌రి చిత్రం కోసం క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టేశాడు. ప్ర‌స్తుతం టైగ‌ర్ ఇజ్రాయేల్ కి వెళుతున్నాడు. అక్క‌డ ర‌క‌ర‌కాల స్టంట్స్ నేర్చుకుని తిరిగి వ‌స్తాడ‌ట. జీవితంలో ప్ర‌తి నిమిషం ఏదో ఒక‌టి నేర్చుకుంటూ త‌న స్థాయిని అంత‌కంత‌కు పెంచుకుంటున్న ఈ హీరో అంద‌రికీ స్ఫూర్తి అని చెప్పాలి.


Tags:    

Similar News