దిల్ రాజు కామెంట్స్ తో కాక మొద‌లైందా?

Update: 2022-11-30 13:30 GMT
టాలీవుడ్ లో ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి.. లౌక్యంతో వ్య‌వ‌హ‌రించాలంటారు. అంతే కాకుండా పైకి న‌వ్వుతూ క‌నిపించాలి. ఇబ్బంది క‌లిగినా స‌రే అది ఎక్క‌డా క‌నిపించ‌కూడదు.. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే టాలీవుడ్ లో వెండితెర‌పై న‌టుల త‌ర‌హాలోనే ఇండ‌స్ట్రీలోనూ తానొవ్వ‌క నొప్పించ‌క అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించాలంటారు. అలా ప్ర‌తీ విష‌యాన్ని చూసి చూడ‌న‌ట్టుగా పోతేనే ఇక్క‌డ మ‌నుగ‌డ అని ఇన్నాళ్లుగా ఎంతో మంది చెబుతూ వ‌చ్చారు. అయితే తాజాగా దిల్ రాజు వాట‌న్నింటినీ ఒక్క ఇంట‌ర్వ్యూతో బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాజాగా దిల్ రాజు ఓ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన విష‌యం తెలిసిందే. ఇండ‌స్ట్రీలో వున్న రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావించ‌డంతో పాటు దిల్ రాజుపై ఇన్ని ఎలిగేష‌న్ లు ఈ మ‌ధ్య కాలంలో రావ‌డానికి కార‌ణం మీరు ఎదిగిపోయార‌నేనా? అని ప్ర‌శ్నిస్తే అది మీరే చెప్పాల‌ని న‌వ్వడం తెలిసిందే. అంతే కాకుండా ప్ర‌తీ సారి ఇండ‌స్ట్రీ అంతా ఓ ఫ్యామిలీ అని, ఏ స‌మ‌స్య వ‌చ్చినా అంతా క‌లిసి క‌ట్టుగా చూసుకుంటామ‌ని చెప్ప‌డం అంతా వ‌ట్టిదేన‌ని దిల్ రాజు చెప్ప‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

అంతే కాకుండా హీరోలు, హీరోయిన్ ల క్యార‌వాన్ క‌ల్చ‌ర్ పై కూడా దిల్ రాజు చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన‌ట్టు తెలుస్తోంది. ఇక `వార‌సుడు` వివాదంపై కూడా దిల్ రాజు స్పందించిన విష‌యం తెలిసిందే. మైత్రీ వారికి నాకు మ‌ధ్య మంచి అనుబంధం వుంది. సంక్రాంతి రిలీజ్ ల విష‌యంలో వారికి లేని అభ్యంత‌రం మిగ‌తా వారికి ఎందుకు వ‌స్తోందని, అంతే కాకుండా ఈ వివాదం వెన‌క ఎవ‌రున్నారో త‌న‌కు తెలుసున‌ని చెప్ప‌డం..

ఇదే సంద‌ర్భంగా డిస్ట్రిబ్యూష‌న్ వ్య‌వ‌స్థ క‌నుమ‌రుగ‌వుతున్న తీరుపై కూడా ఘాటుగా స్పందించ‌డం తెలిసిందే. సినిమా చూపించ‌కుండా డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు అమ్మేస్తున్నార‌ని, క‌థేంటో తెలుసుకోకుండా డిస్ట్రిబ్యూట‌ర్లు సినిమాలు కొని అవి ఆడ‌క‌పోతే భారీగా న‌ష్ట‌పోతున్నార‌న్నారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్‌` తో పాటు చిరంజీవి న‌టించిన `ఆచార్య‌` సినిమాల‌ని ఉదాహ‌రణ‌గా చూపించ‌డం.. అంతే కాకుండా  ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్‌, `మా` అసోసియేష‌న్ పైన కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

సినిమాలు నిర్మించ‌ని, యాక్టీవ్ గా లేని నిర్మాత‌లు చాలా మంది ఇందులో వున్నార‌ని, అలాగే ఒక్క సినిమాలో న‌టించి మెంబ‌ర్ గా మారిన వాళ్లు ఆ త‌రువాత పోటీ చేసి ప‌ద‌వుల్లో వుంటేన్నార‌ని ఘాటుగా స్పందించారు. నిజ‌మే దిల్ రాజు చెప్పిన‌ట్టుగా ప్ర‌స్తుతం సినిమాలు చేయని వారు నిర్మాత‌ల మండ‌లిలో స‌భ్యులుగా వుండి కీల‌క ప‌ద‌వుల్లో కొన‌సాగుతున్నారు, ఇక మా అసోసియేష‌న్ మెంబ‌ర్ల ప‌రిస్థితి కూడా ఇలాగే వుంది. ఒక సినిమాలో చిన్న పాత్ర‌లో క‌నిపించి ఆ త‌రువాత ఏ సినిమాలోనూ క‌నిపించ‌ని వారు కూడా `మా`లో మెంబ‌ర్ లుగా వున్నారు.

 ఎన్నిక‌ల‌వేల మేము సైతం అంటూ పోటీకి దిగుతున్నారు. ప‌ద‌వుల్లో వుంటున్నారు. ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అన్న‌దే దిల్ రాజు వాద‌న అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కొంత మంది చెప్పుకుంటుంటే మరి కొంత మంది మాత్రం ఫైర్ అవుతున్నార‌ట‌. దీంతో దిల్ రాజు వ్యాఖ్య‌ల‌తో ఇండ‌స్ట్రీలో కాక మొద‌లైంద‌ని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News