డిసెంబర్ లో ఉప్పెన తెస్తానంటున్న మెగా వారసుడు..!

Update: 2020-04-19 10:30 GMT
మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం 'ఉప్పెన'. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన కృతీ శెట్టి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌ తో పాటు రెండు లిరికల్ పాటలు వచ్చిన విషయం తెలిసిందే. అవి ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమాపై మంచి అంచనాలు పెరిగేలా చేసాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు అనుకున్నారు. దానికి తగ్గట్లే షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంది. కానీ కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడింది. తర్వాత ఈ సినిమాను మే 7న విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ పరిస్థితులు ఇప్పుడప్పుడే అనుకూలించేలా కనపడకపోవడంతో మళ్ళీ డిసెంబ‌ర్ కి వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారట.

విశ్వ‌స‌నీయ వర్గాల స‌మాచారం ప్ర‌కారం మెగా వారసుడు వైష్ణ‌వ్ తేజ్ లాంఛింగ్ మూవీ 'ఉప్పెన' ఈ ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ట. దీని ప్ర‌కారమే ప్ర‌స్తుతం డైరెక్ష‌న్ టీమ్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ కి షెడ్యూల్ వేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే దాదాపు సినిమాకి సంబంధించిన షూటింగ్ ప‌నులు పూర్తి చేసిన 'ఉప్పెన' టీమ్.. సినిమాలో ఉన్న చిన్న చిన్న క‌రెక్ష‌న్స్ చేయాల‌ని డిసైడ్ అవుతున్నార‌ట‌. అయితే ఈ సినిమాకి మ‌రీ ఎక్కువుగా రీషూట్స్ జ‌ర‌గ‌డం.. సినిమా క‌థ‌లో కూడా చాలా మంది వేలు పెట్టడంతో అనుకున్నదానికంటే బ‌డ్జెట్ ట్రిపుల్ అయింద‌ని టాక్. ఇప్పటికే లాంచింగ్ హీరోకి చాలా ఖర్చు పెడుతున్నాం అని ఆలోచిస్తూ వస్తున్న నిర్మాతలకి ఇది తలకు మించిన భారంగా తయారైందంట. సో ఇంత పెట్ట‌బ‌డి పెట్టి తిరిగి వాటిని తెచ్చుకోవాలంటే ప్ర‌స్తుత ప‌రిస్థితులు సర్దుమణిగే వరకు వెయిట్ చేయడమే మంచిదని మైత్రీ మూవీ మేకర్స్ అండ్ టీమ్ ఆలోచిస్తున్నారట. ఈ కార‌ణంతోనే సినిమాను డిసెంబ‌ర్ లో రిలీజ్ చేస్తే కమర్షియల్ గా వ‌ర్క్ అవుట్ అవుతుంద‌ని 'ఉప్పెన' టీమ్ ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం. ఇదే కనుక జరిగితే నాని - సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న 'వి' సినిమాకి.. అనుష్క 'నిశ్శబ్దం' సినిమాకి లైన్ క్లియ‌ర్ అయినట్లే చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
Tags:    

Similar News