స్టార్‌ హీరోయిన్‌ పై కుర్రహీరో వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2019-08-14 04:22 GMT
తమిళ స్టార్‌ నటుడు శరత్‌ కుమార్‌ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి తమిళం మరియు తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్‌ కుమార్‌. ఈమె నటించిన పలు సినిమాలు తెలుగులో మంచి సక్సెస్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. డైరెక్ట్‌ తెలుగు సినిమాల్లో కూడా నటించేందుకు వరలక్ష్మి శరత్‌ కుమార్‌ రెడీ అవుతోంది. ఇక తాజాగా తమిళంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ 'కాన్ని రాశి' అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో విమల్‌ హీరోగా నటించాడు.

ముత్తు కుమారన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కాన్ని రాశి' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ సందర్బంగా వరలక్ష్మి మరియు విమల్‌ లు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిద్దరు కలిసి ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్బంగా విమల్‌ మాట్లాడుతూ తన కెరీర్‌ లో మొదటి సారి ఒక మగాడికి జోడీగా నటించాను అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశాడు.

ఆ మాటల తాలుకు ప్రభావం వెంటనే గుర్తించిన విమల్‌ తన మాటలను సమర్ధించుకునేందుకు ప్రయత్నించాడు. తన ఉద్దేశ్యంలో ఆమెతో వర్క్‌ చేయడం చాలా కంఫర్ట్‌ గా ఉంటుందని.. ఆమె వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదంటూ చెప్పుకొచ్చాడు. సినిమాలో ఆమె పాత్ర చాలా సహజంగా ఉంటుందని చెప్పి కవర్‌ చేసే ప్రయత్నం చేశాడు. కాని వరలక్ష్మి గురించి విమల్‌ చేసిన వ్యాఖ్యలు రచ్చ చేస్తున్నాయి. వరలక్ష్మి మాత్రం విమల్‌ వ్యాఖ్యలకు పెద్దగా రియాక్ట్‌ అయినట్లుగా అనిపించలేదు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో వరలక్ష్మి తన పెళ్లి గురించి స్పందించింది. ప్రస్తుతానికి తనకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని పేర్కొంది. ఇలాంటి సమయంలో లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటానా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానా అనే విషయం అనవసరం అంది.
Tags:    

Similar News