రాబోయే రోజుల్లో ఆ సినిమాల షూటింగ్స్ పరిస్థితి ఏంటి...?

Update: 2020-06-03 02:30 GMT
సినీ ఇండస్ట్రీ గత రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. థియేటర్స్ మల్టిప్లెక్సెస్ క్లోజ్ అయ్యాయి. సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు తమ రిలీజ్ తేదీలను వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. దీని వలన నిర్మాతలు చాలా కష్టనష్టాలు అనుభవిస్తున్నారు. అయితే కొంతమంది నిర్మాతలు థియేటర్స్ కి ఒకప్పటిలా జనాలు వస్తారో లేదో అనే డౌట్ తో తమ సినిమాలను ఫ్యాన్సీ రేట్లతో ఓటీటీలలో రిలీజ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు కొన్ని రంగాలపై మినహాయింపులు ఇస్తూ వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో షూటింగ్స్ జరుపుకోవచ్చని అనుమతులిస్తూ జీవో జారీ చేసింది. ఇక తెలంగాణాలో పలు దపాల చర్చల అనంతరం సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోవచ్చని.. కొన్ని షరతులతో జూన్ నుండి షూటింగ్స్ జరుపుకోవచ్చని చెప్పింది. దీంతో ఇప్పటికే కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టేసారు. షూటింగ్ లకు అనుమతులిచ్చిన వెంటనే చిత్రీకరణ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్స్ కూడా రెడీగా ఉన్నాయి.

అయితే ప్రభుత్వం పెట్టే సేఫ్టీ నిబంధనల వలన కొన్ని సినిమాల షూటింగ్స్ ఎలా జరగబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి నుండి కొంత కాలం ఎక్కువ మంది నటీనటులు టెక్నీషియన్స్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. చాలా తక్కువ మందితో మాత్రమే చిత్రీకరణ స్టార్ట్ చేసుకునేలా ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేస్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలైన 'ఆర్.ఆర్.ఆర్' 'పుష్ప' 'ఆచార్య' షూటింగ్స్ పరిస్థితి ఏంటని సినీ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలు దాదాపుగా భారీ తారాగణంతో చిత్రీకరించాల్సిన మూవీస్. భారీ సెట్స్.. చాలా మంది సిబ్బంది అవసరమవుతాయి. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'ఆర్.ఆర్.ఆర్' మిగతా భాగంలో చాలా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. దీనికి తక్కువ సిబ్బందితో ఎలా షూటింగ్ చేయాలా అని ఆలోచిస్తున్నారట. ఇక 'పుష్ప' సినిమా విషయానికొస్తే దాదాపు ఈ సినిమా షూటింగ్ మొత్తం అడవులలో జరగాల్సి ఉందట. అడవుల్లో షూటింగ్ అంటే ఎక్కువ మంది సిబ్బంది.. జూనియర్ ఆర్టిస్ట్స్ అవసరం అవుతారు. ఒకవేళ తక్కువ మంది సిబ్బందితో షూట్ స్టార్ట్ చేసినా డైలీ అడవులకు వెళ్లి షూట్ చేసుకొని రావడం అంటే మామూలు విషయం కాదు.

ఇక 'ఆచార్య' పరిస్థితి కూడా అంతే. ఇప్పటికే సింహాచలం టెంపుల్ సెట్ వేసి రెడీగా ఉన్నారట. ఈ సీన్స్ కోసం కూడా ఎక్కువ మంది ఆర్టిస్ట్స్ కావాలట. ఇవన్నీ చూసుకుంటే పెద్ద సినిమాల షూటింగ్స్ స్టార్ట్ అవడం ఇప్పట్లో కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో ప్రభుత్వం షూటింగులకు అనుమతించినా కొన్ని సినిమాలు మరికొన్ని రోజులు వేచి చూసే ధోరణి అవలంభించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్యని సినిమా షూటింగ్స్ స్టార్ట్ అవబోతున్నాయి కదా.. మీ సినిమా వెంటనే స్టార్ట్ అవబోతుందా అని అడుగగా.. 'కరోనా సమస్య అంత చిన్నది కాదు. వెంటనే షూటింగ్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. నా సినిమా వరకైతే చిత్ర యూనిట్ కలిసి కూర్చొని అన్నీ అనుకూలంగా ఉంటేనే చిత్రీకరణ స్టార్ట్ చేస్తామని' చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో భారీ తారాగణం.. సిబ్బంది అవసమైన సినిమాల వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News