'లవ్ స్టోరీ' విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..!

Update: 2021-04-08 08:36 GMT
దేశవ్యాప్తంగా కరోనా మళ్ళీ కోరలు చాచింది. ఒకవైపు కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా సాగుతుంటే.. మరోవైపు రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో సినీ ఇండస్ట్రీలో కలవరం మొదలైంది. సుమారు 10 నెలల పాటు మహమ్మారి కోరల్లో చిక్కుకున్న టాలీవుడ్.. లాక్ డౌన్ తర్వాత సాదారణ పరిస్థితికి తీసుకురాడానికి బాగా కృషి చేసింది. థియేటర్స్ కి ఎప్పటిలాగే జనాలు వస్తుండటంతో వారం వారం కొత్త సినిమాలతో సినీ వినోదాన్ని అందిస్తున్నారు. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాల పరిస్థితి ఎలా వుంటుందో అనే ఆలోచన అందరిలో ప్రారంభమైంది.

ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలన్నీ వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ 'వకీల్ సాబ్' విడుదల తర్వాత వచ్చే సినిమాల పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 16న రిలీజ్ అవ్వాల్సిన 'లవ్ స్టోరీ' చిత్రాన్ని వాయిదా వేయాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెడీగా ఉన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆల్రెడీ కర్ణాటకలో థియేటర్ ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించారు. జనాలు మళ్ళీ గతేడాది లాగే ఇంటికే పరిమితం అవుతారనే భయం కూడా ఉంది.  

దీంతో ప్రస్తుతానికి 'లవ్ స్టోరీ' చిత్రాన్ని వాయిదా వేస్తేనే మంచిదని చైతూ - శేఖర్ కమ్ముల భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో నిర్మాతలు బయ్యర్లతో మీటింగ్ పెట్టారట. కొంతమంది విడుదల వాయిదా వేయమని కోరితే.. మరికొందరు రిలీజ్ చేస్తేనే బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారట. దీంతో ఇప్పుడు మేకర్స్ డైలమాలో పడ్డారని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఒకవేళ వాయిదా వేసిన ఇప్పట్లో సోలో రిలీజ్ డేట్ దొరకడం అంటే కష్టం. మరి 'లవ్ స్టోరీ' విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News