ఓటీటీలలో స్ట్రీమింగ్ అయ్యే డబ్బింగ్ సినిమాలకు ఆదరణ లభిస్తుందా...?

Update: 2020-08-02 08:30 GMT
దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన గత నాలుగు నెలలుగా థియేటర్స్ లో సినిమా రిలీజ్ కాలేదు. దీంతో ఇంటికే పరిమితమైన జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం టీవీలు ఇంటర్నెట్ ఓటీటీలతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలు కూడా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లలో రిలీజ్ చేస్తుండటంతో ఓటీటీలకు ఏటీటీలకు ఆదరణ పెరిగింది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, సన్ నెక్స్ట్, ఎమెక్స్ ప్లేయర్, జీ 5 లాంటి ఓటీటీలు సబ్స్క్రైబర్స్ పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో వీటన్నిటికీ పోటీ ఇస్తూ మొట్టమొదటి సారిగా మన తెలుగు నుంచే వచ్చిన స్ట్రీమింగ్ యాప్ “ఆహా” క్రియేట్ చేయబడింది. అయితే మొదట్లో 'ఆహా' మంచి ఆదరణ దక్కించుకున్నా రానురాను మిగతా ఓటీటీల రేంజ్ లో కంటెంట్ అప్లోడ్ చేయడం లేదనే కామెంట్స్ వచ్చాయి. ఇటీవల 'ఆహా'లో స్ట్రీమింగ్ అయిన ''భానుమతి రామకృష్ణ'' ''కృష్ణ అండ్ హిజ్ లీల'' సినిమాలు పర్వాలేదనిపించుకున్నాయి.

కాగా, ఇప్పుడు కొత్త సినిమాలు లేకపోవడంతో తమిళ్ కన్నడ మలయాళం సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను తెలుగులో డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. ముందుగా వేరే ఓటీటీలలో ఎక్కువ హిట్స్ వచ్చిన ఇతర భాషా చిత్రాల డబ్బింగ్ వర్షన్ ని 'ఆహా'లో అప్లోడ్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో 'లక్ష్మి' '100' 'ఫోరెన్సిక్' '36 వయసులో' 'జిప్సి' 'ఇంకా ఏమైనా' 'షైలాక్' వంటి తెలుగు డబ్బింగ్ సినిమాలు ప్రసారం అవుతున్నాయి. త్వరలో 'ట్రాన్స్' 'మగువలు మాత్రమే' అనే సినిమా కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. వ్యూయర్ షిప్ బాగున్న సినిమాలను డబ్బింగ్ చేయడం మంచి ప్లానే అయినా.. ఇది కేవలం టైర్ 2 ఆడియన్స్ కి మాత్రమే వర్క్ అవుట్ అవుతుంది. టైర్ 1 ఆడియన్స్ ఒరిజినల్ వెర్షన్ చూడటానికే ఇష్టపడతారు. అందుకే ఒక భాషలో హిట్ అయిన సినిమాలు తెలుగులో రీమేక్ చేయబడి ప్లాఫ్ సినిమాలుగా మిగిలిపోయాయి. రీమేక్ సినిమాలనే తెలుగు ఆడియన్స్ పెద్దగా పట్టించుకోనప్పుడు ఓటీటీలో విడుదలయ్యే డబ్బింగ్ సినిమాలకి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News