కార్మికుల మెరుపు స‌మ్మె.. షూటింగ్ ల‌కు బ్రేక్ ప‌డనుందా?

Update: 2022-06-21 10:30 GMT
క‌రోనా కార‌ణంగా ప్ర‌తీ వ‌స్తువు రేటు పెరిగింది. కానీ స‌గ‌టు మ‌నిషి జీవ‌న ప్ర‌మాణ రేటు మాత్రం పెర‌గ‌లేదు. దీంతో క‌నీస అవ‌స‌రాల ధ‌రం ఆకాశాన్నంట‌డంతో సామాన్యులు తీవ్ర అవ‌స్త‌లు ప‌డుతున్నారు. సినీ కార్మికులు కూడా గ‌త కొంత కొంత కాలంగా గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.

దీంతో త‌మ‌కు క‌నీస వేత‌నాన్ని అమ‌లు చేయాల‌ని కొంత కాలంగా ప్రొడ్యూస‌ర్ల‌ని డిమాండ్ చేస్తున్నార‌ట‌. సినిమా బ‌డ్జెట్ లు పెరిగిపోయినా, రెమ్యున‌రేష‌న్ లు పెరిగినా త‌మ వేత‌నాలు అయితే పెర‌గ‌డం లేద‌ని సినీ కార్మికులు మెరుపు స‌మ్మెకు రెడీ అయిన‌ట్టుగా తెలుస్తోంది.

సినీ కార్మికుల వేత‌న స‌వ‌ర‌ణ‌ను తెలుగు చిత్ర సీమ వ‌ర్గాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కుతోంది. సినిమా కార్మికుల‌తో వేత‌న స‌వ‌ర‌ణ ఒప్పందం చేసుకోవాల్సిన ఫిల్హ్ ఛాంబ‌ర్ ఆ దిశ‌గా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు.

ఇదిలా వుంటే తెలుగు నిర్మాత‌ల మండ‌లి సైతం ఫెడ‌రేష‌న్ సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ప‌క్క‌న పెట్టేసింద‌ని కార్మికులు ఆరోపిస్తున్నారు.

గ‌తంలో త‌మ‌తో చేసుకున్న ఒప్పందాల‌ను అమ‌లు చేయ‌నందున ఫెడ‌రేష‌న్ నేత‌ల మాట‌ల‌ని గౌర‌వించాల్సిన ప‌ని లేద‌ని నిర్మాత‌ల మండ‌లి తాజాగా తేల్చి చెప్పింద‌ట‌. ఈ నేప‌థ్యంలో త‌మ క‌నీస వేద‌న స‌వ‌ర‌ణ‌ని నిర్మాత‌లు ప‌ట్టించుకోని నేప‌థ్యంలో సినీ కార్మికులు జూన్ 22 నుంచి మెరుపు స‌మ్మెకు దిగుతున్న‌ట్టుగా ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

బుధ‌వారం నుంచి షూటింగ్ ల‌ని బ‌హిష్కరించాల‌ని, ఈ విష‌యంపై ఫెడ‌రేష‌న్ ముట్ట‌డికి పిలుపునిచ్చారు. బుధ‌వారం 24 క్రాఫ్ట్ ల‌కు చెందిన కార్మికులు ఫెడ‌రేష‌న్ ముట్ట‌డికి రెడీ అవుతుండ‌టం సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News