తమిళ డైరెక్టర్‌కు మహేష్ బాబుతో మూవీ తీయాలనుందట!
అందులో డైరెక్టర్ అశ్వత్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన డ్రాగన్ మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. రీలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా డ్రాగన్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న నిర్వహించగా, అందులో డైరెక్టర్ అశ్వత్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
2020లో తన ట్విట్టర్ అకౌంట్ కు ఎప్పుడూ లేనంతగా విపరీతమైన వ్యూస్ వచ్చాయని, ఏమైందో తనకు అర్థం కాలేదని, కాసేపటి తర్వాత తనకు ఓ విషయం అర్థమైందని, తాను తీసిన ఓహ్ మై కడవులే మూవీ గురించి మహేష్ బాబు ట్వీట్ చేశారని, అందుకే తన అకౌంట్ అంత ఫేమస్ అయిందని తెలిసిందని, మహేష్ ఆ ట్వీట్ లో తనను ప్రశంసిస్తూ పోస్ట్ చేశాడని తెలిపాడు అశ్వత్.
ఓహ్ మై కడవులే చాలా చిన్న సినిమా అని, కేవలం రూ.3 కోట్లతోనే ఆ సినిమాను తీశామని చెప్పిన అశ్వత్, ఆ సినిమా గురించి మహేష్ ను అడక్కుండానే ఆయన ఆ పోస్ట్ చేశారని, ఆయన పోస్ట్ చేసిన తర్వాత ఎంతో మంది తెలుగు డైరెక్టర్లు, నటీనటులు తమ సినిమాను చూసి టీమ్ ను అభినందించినట్టు చెప్పుకొచ్చాడు.
అంతేకాదు, మహేష్ ఆ పోస్ట్ చేసినప్పటి నుంచి ఒక్క ఛాన్స్ ఇస్తే అతనితో సినిమా చేయాలని అనుకుంటున్నట్టు అశ్వత్ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. ప్రస్తుతం మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ఎంతలేదన్నా రెండు మూడేళ్ల టైమ్ పడుతుంది.
రాజమౌళి సినిమా తర్వాత మహేష్ రేంజ్, మార్కెట్, ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతటి ఫాలోయింగ్ వచ్చాక మహేష్ అశ్వత్ లాంటి చిన్న డైరెక్టర్ తో సినిమా చేయడం దాదాపు కుదరదు. ఏమో అన్నీ బావుండి కుదిరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి అశ్వత్ కోరిక నెరవేరుతుందో లేదో.