కల్కి 2898 AD.. అశ్వత్థామ తెలుగు ప్రోమోతో కిక్కు
తెలుగు చిత్రసీమ సహా దేశంలోని అన్ని ప్రముఖ పరిశ్రమలు ఎంతో ఎగ్జయిటింగ్ గా ఈ ప్రాజెక్ట్ గురించి వేచి చూస్తున్నాయి.
ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ 2024 మూవీ -కల్కి 2898 AD. భవిష్యత్ సమాజం సాంకేతిక పరివర్తనం నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం రూపొందుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ అధినేత అశ్వనిదత్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా పరిగణనలో ఉన్న కల్కి నుంచి ఇప్పటికే వీడియో గ్లింప్స్ రిలీజయ్యాయి.
తెలుగు చిత్రసీమ సహా దేశంలోని అన్ని ప్రముఖ పరిశ్రమలు ఎంతో ఎగ్జయిటింగ్ గా ఈ ప్రాజెక్ట్ గురించి వేచి చూస్తున్నాయి. ప్రభాస్ అభిమానులు సహా ఈ చిత్రంలో నటిస్తున్న కమల్ హాసన్, అమితాబ్ ఫ్యాన్స్ లోను క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రచార కంటెంట్ ఉత్కంఠ కలిగించింది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ వంటి దిగ్గజ స్టార్ల చేరిక ప్రేక్షకులను మంత్రముగ్ధం చేస్తోంది.
థియేట్రికల్ గా అత్యంత భారీగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఇప్పటికే ప్రారంభించారు. కల్కి 2898 AD టీమ్ కొన్ని రోజుల క్రితం లెజెండరీ అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ హిందీ వీడియోని అధికారికంగా విడుదల చేసింది. బిగ్ బి లుక్ - విజువల్స్ ఆశ్చర్యపరిచే విధంగా ఉండటంతో ఇది బాగా ఆకట్టుకుంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు సాంకేతిక నిపుణుల పనితనం కూడా ఆకర్షిస్తోంది.
ఇప్పుడు ఈ ప్రోమో తెలుగు వెర్షన్ విడుదలైంది. ఇందులో అమితాబ్ డైలాగ్స్ మరింత ఆసక్తిని పెంచాయి. ``ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నా. ద్రోణాచార్యుడి పుత్రుడిని. నా పేరు అశ్వత్థామ`` అంటూ డైలాగ్ చెప్పారు అమితాబ్. దీనికి అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు. అమితాబ్ పాత్ర ప్రాముఖ్యత ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మరింత స్పష్టంగా అర్థమైంది. డిస్టోపియన్ బ్యాక్‌డ్రాప్ .. నటీనటుల లుక్ వీక్షకులలో చాలా ఆసక్తిని రేకెత్తించాయి. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజర్ కాగా, డిజోర్డ్జే స్టోజిలిజ్కోవిచ్ ఫోటోగ్రఫీ డైరెక్టర్. దర్శకుడు నాగ్ అశ్విన్ వీఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో దిశా పటానీ ఒక స్పెషల్ నంబర్ లో కనిపించనుంది.