'బేబీ జాన్' థియేటర్‌లో పుష్ప కోసం ఫ్యాన్స్ రచ్చ
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమాను తెలుగు ప్రేక్షకుల కంటే ఎక్కువగా నార్త్ ప్రేక్షకులు ఆధరిస్తున్నారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమాను తెలుగు ప్రేక్షకుల కంటే ఎక్కువగా నార్త్ ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర సౌత్ రాష్ట్రాల్లో ఇప్పటికే పుష్ప 2 రన్ దాదాపుగా పూర్తి అయ్యింది. వచ్చే వారానికి పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ నార్త్ ఇండియాలో మాత్రం పుష్ప 2 జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సొంతం చేసుకున్న తర్వాత కూడా వసూళ్ల జోరు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సినిమా నార్త్ ఇండియాలో అత్యధిక థియేటర్‌లలో కొనసాగుతోంది. పుష్ప 2 దెబ్బకు యావరేజ్ టాక్ దక్కించుకున్న బేబీ జాన్ సినిమా డిజాస్టర్ వసూళ్లు నమోదు చేసింది.
వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా అట్లీ నిర్మాణంలో వచ్చిన బేబీ జాన్ సినిమా తమిళ్ హిట్ మూవీకి రీమేక్ అనే విషయం తెల్సిందే. కచ్చితంగా హిందీలో బేబీ జాన్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచింది. మొదటి రోజు గౌరవ ప్రదంగా రూ.12 కోట్లు వసూళ్లు రాబట్టిన ఆ సినిమా రెండో రోజు అతి తక్కువగా రూ.5 కోట్లు మాత్రమే రాబట్టింది. పుష్ప 2 ప్రభావం చాలా ఉంది అంటూ బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల వారితో పాటు, సినీ వర్గాల వారు బలంగా నమ్ముతున్నారు. బేబీ జాన్ సినిమా విడుదల విషయంలో తప్పు జరిగింది అంటూ కొందరు అంటున్నారు.
తాజాగా పుష్ప 2 సినిమా కోసం అంటూ థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకులు స్క్రీన్ పై బేబీ జాన్ సినిమా వేయడంతో షాక్ అయ్యారు. తమకు బేబీ జాన్ వద్దు, పుష్ప 2 సినిమా కావాల్సిందే అని నానా రచ్చ చేశారట. సమాచారం ఇవ్వకుండా మీరు సినిమాను ఎలా మారుస్తారు, మేము పుష్ప 2 సినిమా చూడటం కోసం థియేటర్‌కు వచ్చామని నార్త్ ఇండియాలోని ఒక రాష్ట్రంలో థియేటర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆన్‌లైన్‌లో పుష్ప 2 సినిమా కోసం టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్తే బేబీ జాన్ సినిమా వేశారు. దాంతో షో మేము చూడము అంటూ చాలా మంది వెళ్లి పోవడంతో పాటు కొందరు థియేటర్‌లోనే నానా హంగామా చేశారని తెలుస్తోంది.
హిందీ ప్రేక్షకులకు పుష్ప 2 చాలా దగ్గర అయ్యింది. కేవలం హిందీ వర్షన్ రూ.1000 కోట్ల వసూళ్లకు చేరువ అయ్యింది. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా ఆ స్థాయిలో వసూళ్లు సొంతం చేసుకోలేదు. దేశ వ్యాప్తంగా పుష్ప 2 మ్యానియా కొనసాగుతోంది. రూ.1800 కోట్లకు చేరువ అయ్యింది. అతి త్వరలోనే బాహుబలి 2 సినిమా వసూళ్లు బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన పుష్ప 2 సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, శ్రీలీల కిస్సిక్ అంటూ ఐటెం సాంగ్ చేసి అదరగొట్టింది. ఇక మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. అల్లు అర్జున్‌కి మరోసారి జాతీయ అవార్డ్ రావడం ఖాయం అంటూ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.