బాల‌య్య‌ అలక.. 'బ్రో' అని పిలవాలంటూ చరణ్ కు స్వీట్ వార్నింగ్!

అంతకముందు చరణ్ 'సార్' అని పిలవగా.. ''నా సెట్‌లోకి అనుమతి లేదు" అంటూ బాలయ్య అలక బూనడం నవ్వు తెప్పిస్తుంది. అలానే తనను 'బ్రో' అని పిలవమని చెప్పడం సరదాగా అనిపిస్తుంది.

Update: 2024-12-31 09:18 GMT

నటసింహం నంద‌మూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాప‌బుల్ షో' సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న నాలుగో సీజన్ లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు గెస్టులుగా సందడి చేశారు. లేటెస్ట్ ఎపిసోడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం ఈ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. బాలకృష్ణతో కలిసి చరణ్ సందడి చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

అన్‌స్టాపబుల్ షో సెట్స్‌లో బాలకృష్ణ - రామ్ చరణ్ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా హగ్ చేసుకొని, చాలా ఆప్యాయంగా పలకరించుకున్నారు. అంతకముందు చరణ్ 'సార్' అని పిలవగా.. ''నా సెట్‌లోకి అనుమతి లేదు" అంటూ బాలయ్య అలక బూనడం నవ్వు తెప్పిస్తుంది. అలానే తనను 'బ్రో' అని పిలవమని చెప్పడం సరదాగా అనిపిస్తుంది. ఇక బాలకృష్ణ ఈ సందర్భంగా చెర్రీ చెయ్యి పట్టుకొని "సంక్రాంతికి వస్తున్నాం.. 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్' సినిమాలు రెండూ తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. మనం ఇండస్ట్రీకి మంచి సక్సెస్ ఇవ్వాలి. చిత్ర పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలి" అని అన్నారు. దీనికి చరణ్ సరే అంటూ బాలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. చరణ్ నటిస్తున్న 'గేమ్ చేంజర్', వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు కూడా అదే సీజన్ లో రెండు రోజుల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీంతో మూడు చిత్రాల మధ్య పొంగల్ ఫైట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే అన్‌స్టాపబుల్ టాక్ షో ఈ క్లాష్ ను ఆహ్లాదకరమైన పోటీగా మార్చేసిందని చెప్పాలి.

ఇప్పటికే వెంకటేష్ తన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా టీమ్ తో కలిసి అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. బాలయ్యతో ఎన్నో సరదా కబుర్లు చెప్పడమే కాదు, రెండు సినిమాలు హిట్ అవ్వాలని ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ సైతం 'గేమ్ చేంజర్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ టాక్ షోకి గెస్ట్ గా వచ్చారు. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ హీరోల మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉంది, పోటీ వాతావరణం ఎలా వుందనేది స్పష్టం అవుతుంది.

ఏదేమైనా మెగా, నందమూరి హీరోలు ఒకే వేదికను పంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇరు వర్గాల మధ్య దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. రాజకీయాల పరంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. అయినప్పటికీ కలిసినప్పుడు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. బాలకృష్ణ 50 ఏళ్ల ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ లో రామ్ చరణ్ పాల్గొన్నారు. అలానే గతంలో ఒక అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ లో చరణ్ ఫోన్ లో మాట్లాడారు. త‌ప్ప‌కుండా ఈ షోకి వ‌స్తాన‌ని చెర్రీ అప్పుడే అన్నారు. చెప్పినట్లుగానే ఇన్నాళ్లకు బాలయ్య షోలో అడుగుపెట్టారు.

ఎప్ప‌ట్నుంచో మెగా, నందమూరి ఫ్యాన్స్ ఈ క‌లయిక కోసం ఎదురుచూస్తున్న నేప‌థ్యంలో, రామ్ చరణ్ తో బాలయ్య చేసిన అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ స్పెషల్ గా నిలిచిపోతుందని అందరూ భావిస్తున్నారు. అయితే వీరిద్దరూ ఎలాంటి విషయాల మీద చర్చిస్తారు? అనే ఆసక్తి నెలకొంది. 'డాకు మ‌హారాజ్' టీమ్ తో ఇప్పటికే అన్‌స్టాపబుల్ షోలో ఓ ఎపిసోడ్ ను షూట్ చేశారు. దీని తర్వాత చరణ్ ఎపిసోడ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కు రానుంది.

Tags:    

Similar News