బాలీవుడ్ ఇండస్ట్రీని ఇకపై ఏలేది వాళ్లే!
ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేక్షకుల అభిరుచుల్లోనూ విప్లవాత్మక మార్పులొచ్చాయి.;

ఇండియన్ సినిమా అంటే ప్రపంచ సినీ దిగ్గజాలకు బాలీవుడ్ మాత్రమే. ప్రాంతీయ భాషలకు సంబంధించిన ఇండస్ట్రీలు ఎన్ని వున్నా, ఎంత అద్భుతమైన సినిమాలు రూపొందించినా ప్రపంచ సినిమా దిగ్గజాలు పెద్దగా గుర్తించేవి కావు. వారి దృష్టి మొత్తం బాలీవుడ్ మీదే ఉండేది. బాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఇండియన్ సినిమా అంటే తామేనని క్రెడిట్‌ని దక్కించుకునేవారు. మా తరువాతే ఎవరైనా అనే ఫీలింగ్‌తో ఉండేవారు. కానీ ఇది ఒకప్పటి మాట.
ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేక్షకుల అభిరుచుల్లోనూ విప్లవాత్మక మార్పులొచ్చాయి. దీంతో ఇండియన్ సినిమా అంటే తామేనని జబ్బలు చరుచుకున్న బాలీవుడ్ దిగ్గజాలకు గడ్డుకాలం మొదలైంది. కోవిడ్ తరువాత బాలీవుడ్ సినిమా మరింతగా పతనం వైపు అడుగులు వేయడం మొదలు పెట్టింది. స్టార్ హీరోలు, సూపర్ స్టార్‌లు నటించిన సినిమాలని ప్రేక్షకులు తిరస్కరించడంతో అవి బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలని సొంతం చేసుకుని సూపర్ స్టార్‌లకు, మేకర్స్‌కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి.
వరుసగా స్టార్‌లు, సూపర్ స్టార్‌లు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టేయడం, వందలకోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాలు అందులో సగం కూడా వెనక్కి తీసుకురాలేకపోవడంతో బాలీవుడ్ వర్గాల్లో అసహనం, ఓ విధమైన భయం మొదలైంది. గతంలో ఇండియన్ సినిమాని ప్రపంచ యవనికపై సగర్వంగా నిలబెట్టిన బాలీవుడ్ సినిమా ఇప్పడు వెలవెళబోవడానికి, ప్రేక్షకుల ఆదరణ కోల్పోవడానికి ప్రధాన కారణం బాలీవుడ్ డైరెక్టర్స్. చిన్నతనం నుంచి మెట్రోపాలిటన్ సిటీస్‌లో పెరిగిన రిచ్ కిడ్స్ గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలని మోడ్ర్న సినిమా పేరుతో డైరెక్ట్ చేయడం మొదలు పెట్టారు.
పేరుకే బాలీవుడ్ సినిమాగా, కథ అంతా విదేశాల్లో తిరగడం, ఇండియన్ కల్చర్ పూర్తిగా కనిపించకపోవడంతో బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు రిజెక్ట్ చేయడం మొదలు పెట్టారు. దీంతో బాలీవుడ్ సినిమా పతనావస్థకు చేరుకుంది. అయితే ఈ ఇండస్ట్రీ మళ్లీ తన పూర్వవైభవాన్ని సొతం చేసుకుంటుందని ట్రేడ్ పండితులు, సినీ విమర్శకులు అంటున్నారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీని నిలబెట్టి ఏలేది మాత్రం ముంబయిలో పుట్టి పెరిగిన వాళ్లు మాత్రం కాదు. బాలీవుడ్‌కు ప్రస్తుతం కొత్త తరం, కొత్త రక్తం అవసరం.
అందుకే ఇండియా నలుమూలల నుంచి న్యూ డైరెక్టర్స్ బాలీవుడ్ బాటపడుతున్నారు. కొత్తతరహా ఆలోచనలతో ఇండియా సోల్‌ని మిస్ అవ్వకుండా కథలని సిద్ధం చేసుకుని దేశ నలుమూలల నుంచి ముంబాయి బాటపడుతున్నారు. దీంతో బాలీవుడ్ త్వరలోనే కొత్త దర్శకులతో, వారి ఆలోచనలతో రూపొందబోయే సినిమాలతో నూతన జవసత్వాలని సొంతం చేసుకుని మళ్లీ తన సత్తా చాటడం ఖాయమని తెలుస్తోంది. రానున్న రోజుల్లో బాలీవుడ్ నూతన కళని సంతరించుకుని మరింత మందికి అవకాశాల్ని అందించాలని ఆశిద్దాం.