నిజాయితీగా తప్పును అంగీకరించిన అగ్రనిర్మాత
RRR - జవాన్ - పఠాన్ వంటి చిత్రాలు 1000 కోట్ల వసూళ్లతో సంచలనాలు సృష్టించాయి.
RRR - జవాన్ - పఠాన్ వంటి చిత్రాలు 1000 కోట్ల వసూళ్లతో సంచలనాలు సృష్టించాయి. పాన్ ఇండియాలో భారీ యాక్షన్ చిత్రాలు గొప్ప వసూళ్లను రాబట్టాయి. అయితే తన సినిమా మైదాన్ అలాంటి వసూళ్లను రాబట్టడంలో ఎందుకు విఫలమైందో అగ్రనిర్మాత బోనీ కపూర్ ఎలాంటి భేషజాలు లేకుండా వెల్లడించాడు. చిత్రకథానాయకుడు అజయ్ దేవగన్‌ను సమర్థిస్తూ తన తప్పులను నిజాయితీగా అంగీకరించాడు.
బోనీ కపూర్ `మైదాన్`కు కావాల్సిన పెట్టుబడులు పెడుతూ అండగా నిలిచాడు కానీ బాక్సాఫీస్ వద్ద బయోపిక్‌ను అందించడానికి ముందు ప్రేక్షకుల డిమాండ్‌లను గుర్తించడంలో విఫలమయ్యాడు. ఇదే విషయాన్ని ఆయన తాజా ఇంటర్వ్యూలో అంగీకరించాడు. అజయ్ దేవగన్ నటించిన మైదాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి భారీ నష్టాల బాట పట్టింది. ఆసియా క్రీడల్లో తొలి బంగారు పతకాన్ని సాధించి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ ప్రేక్షకులు థియేటర్లలో చూసేందుకు వెళ్లలేదు. ఇప్పుడు నిర్మాత బోనీ కపూర్ ఎట్టకేలకు సినిమా పరాజయాన్ని అంగీకరించాడు. నిర్మాతగా తన అతిపెద్ద తప్పును అంగీకరించాడు.
నిజానికి మైదాన్ రాంగ్ టైమ్ లో వచ్చిన సినిమా అని, యాక్షన్ సినిమాలు ఆడుతున్న ఇలాంటి సమయంలో తాను ఈ సినిమా తీయాల్సింది కాదని కూడా చిత్రనిర్మాత బోనీ కపూర్ అన్నారు. ఇది పెద్ద ఎదురుదెబ్బ అని నిర్మాత వ్యాఖ్యానించారు. అయితే తాను సమయానుకూలంగా అక్షయ్ కుమార్ `బడే మియాన్ చోటే మియాన్`తో ఈద్ బాక్సాఫీస్ ఘర్షణను స్పష్టంగా అర్థం చేసుకోలేకపోయానని అన్నారు.
నిర్మాత బోనీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ-``మేము ఎంచుకున్న సబ్జెక్ట్ అద్భుతమైనది. నటుడు (అజయ్ దేవగన్) అద్భుతమైనవాడు. కానీ ఏదో ఒకవిధంగా మేము ప్రేక్షకుల డిమాండ్లను గుర్తించలేదు. ఈరోజు ప్రేక్షకులు RRR, జవాన్, పఠాన్ వంటి అన్ని ఫ్రంట్ ఫుట్ యాక్షన్ చిత్రాలను కోరుకుంటున్నారు`` అని అన్నారు. గత సంవత్సరం పఠాన్, జవాన్, యానిమల్ భారీ విజయాల తర్వాత బాక్సాఫీస్ విజయాల విషయానికి వస్తే బాలీవుడ్ చిత్రాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. మైదాన్ , బడే మియాన్ చోటే మియాన్ అనే రెండు పెద్ద చిత్రాలతో ఏప్రిల్ నెలలో బెటర్ మెంట్ ని ఆశించారు. అయితే ఈద్ రిలీజ్‌లు రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
మరోవైపు ఈద్ సందర్భంగా విడుదలైన రెండు మలయాళ చిత్రాలు ఆవేశం, వర్షంగల్కు శేషం అద్భుతంగా ఆడాయి. నిజానికి ఫహద్ ఫాసిల్ ఆవేశం ఈ సంవత్సరం అతిపెద్ద ఉత్తమమైన ఈద్ విడుదలగా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 152 కోట్లు వసూలు చేసింది. కానీ భారీ బడ్జెట్ తో రూపొందించిన మైదాన్ ఇందులో సగం కూడా వసూలు చేయలేక చతికిలపడింది. మైదాన్ బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 67 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేయగా.. భారతదేశంలో 48.54 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే బోనీ కపూర్ అంగీకరించిన తప్పిదాలు మాత్రమే కాకుండా.. మైదాన్ విఫలమవడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. ఈ సినిమా మేకింగ్ లోపాలపైనా క్రిటిక్స్ చాలా కోణాల్లో చర్చించారు.