పవన్ కల్యాణ్ నా తాట తీసేస్తారు: బన్నీ వాస్
టాలీవుడ్ లో కొణిదెల, అల్లు కుటుంబాలను కలిపి 'మెగా ఫ్యామిలీ'గా పేర్కొంటారు.
టాలీవుడ్ లో కొణిదెల, అల్లు కుటుంబాలను కలిపి 'మెగా ఫ్యామిలీ'గా పేర్కొంటారు. మెగా సంపోర్ట్ తో ఇప్పటికే ఎంతో మంది హీరోలు వచ్చారు. ఎంతమంది వచ్చినా, ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి కష్టపడుతూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఈ ఫ్యామిలీలో విబేధాలు వచ్చినట్లుగా రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారనే ఊహాగానాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెగా బంధం మీద నిర్మాత బన్నీ వాస్ తాజా ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ తో తన రిలేషన్ గురించి చెప్పారు.
ఎన్నాళ్ళ నుంచో మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం కలిగి ఉన్న బన్నీ వాస్.. ప్రస్తుతం తన పరిస్థితి మిక్సీలో వేసిన క్యారేట్ మాదిరిగా ఉందని అన్నారు. పైకి జ్యూస్ కనిపిస్తున్నా, లోపల మాత్రం ఎప్పుడు ఏ మర వచ్చి కోస్తుందో తెలియదని చెప్పారు. కానీ మెగా ఫ్యామిలీలో ఏదో జరగబోతోందనే విధంగా ఏమీ లేదన్నారు. రిలేషన్ షిప్ లో వీరంతా చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తారని, ఇవన్నీ తాత్కాలిక ఎమోషన్స్ మాత్రమే అని చెప్పారు. వీళ్ళ మధ్యలో ఉన్న స్ట్రాంగ్ థ్రెడ్ తనకి తెలుసని, అది ఏ రోజుకీ పోదని స్పష్టం చేసారు. ఒక్క మీటింగ్ లేదా డిన్నర్ తో ఇందంతా సమసిపోతుందని బన్నీ వాస్ అన్నారు.
రాజకీయాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ శాశ్వత శతృత్వాలు వుండవని బన్నీ వాస్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వెళ్లి పెద్దగా ఎదగాలని తాను అనుకోలేదని, పాలిటిక్స్ కంటే పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. పదవులు సంపాదించాలనేది తన టార్గెట్ కాదని, పవన్ కోసం పని చేయడమే ముఖ్యమన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచే తన గురించి పవన్ కు తెలుసని, పవన్ కళ్యాణ్ పిలిచి మరీ 2024 ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఇప్పుడు ఏ పార్టీ పదవి ఇచ్చినా తీసుకోడానికి తాను సిద్ధంగా ఉన్నానని బన్నీ వాస్ స్పష్టం చేసారు.
జనసేన పార్టీ తరపున ఏవైనా కీలక పదవులు ఇస్తే కచ్చితంగా తీసుకుంటానని, కానీ ప్రభుతం తరపున ఇచ్చే నామినేటెడ్ పదవులకు మాత్రం దూరంగానే ఉండాలని అనుకుంటున్నాని బన్నీ వాస్ తెలిపారు. ఎందుకంటే అధికార పదవులైతే బాధ్యతతో పాటుగా ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉంటుందని, పార్టీ పదవి అయితే తాను పవన్ కళ్యాణ్ ఒక్కరికే జవాబుదారీగా ఉంటానని చెప్పారు. తన వ్యాపారాలు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను నామినేటెట్ పదవులు తీసుకోలేనని అన్నారు. ఏదో పదవి ఇచ్చారని యాక్ట్ చేయడానికి కుదరదని, ప్రభుత్వానికి సంబంధించి పదవి తీసుకొని పూర్తి బాధ్యతతో పని చేయకపోతే పొలిటికల్ బాస్ పవన్ కళ్యాణ్ తన తాట తీసేస్తారని, మళ్ళీ లైఫ్ లో ఆయన దగ్గరకు వెళ్లలేమని బన్నీ వాస్ చెప్పుకొచ్చారు.