కోట్లాది రూపాయ‌ల స్కామ్‌లో న‌టులపై FIR!

సంఘంలో హైప్రొఫైల్స్ ని న‌మ్మి డ‌బ్బును పెట్టుబ‌డిగా పెట్టిన‌ ప్ర‌జ‌లు చివ‌రికి మోస‌పోయిన ఘ‌ట‌న‌లున్నాయి.

Update: 2025-02-03 00:30 GMT

సంఘంలో హైప్రొఫైల్స్ ని న‌మ్మి డ‌బ్బును పెట్టుబ‌డిగా పెట్టిన‌ ప్ర‌జ‌లు చివ‌రికి మోస‌పోయిన ఘ‌ట‌న‌లున్నాయి. ఇది కూడా అదే బాప‌తు. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుల ప్ర‌చారాన్ని న‌మ్మిన ప్ర‌జ‌లు భారీగా డ‌బ్బు పెట్టుబ‌డి పెట్టి, రిట‌ర్నులు రాక‌పోవ‌డంతో చివ‌రికి మోస‌పోయామ‌ని గ్ర‌హించారు. కంపెనీ సూత్ర‌ధారులే భారీ స్కామ్ కి తెర తీయ‌డంతో ఈ ప‌రిణామం అరెస్ట్ ల‌కు దారి తీస్తోంది.

బాలీవుడ్ ప్ర‌ముఖ‌ నటులు అలోక్ నాథ్, శ్రేయాస్ తల్పాడే ల‌తో పాటు, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన ఐదుగురు సభ్యులపై లక్నోలోని ఉత్తరప్రదేశ్- గోమతి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ ఏడుగురు నిందితులు 45 మంది పెట్టుబడిదారులను రూ.9.12 కోట్లకు మోసం చేశారని ఎఫ్ఐఆర్‌ పేర్కొంది.

న‌టులు అలోక్ నాథ్, శ్రేయాస్ త‌ల్పాడే స‌హా మరో 11 మందిపై హర్యానాలోని సోనిపట్‌లో కూడా అదే మల్టీ-లెవల్ మార్కెటింగ్ స్కామ్ విష‌యంలో కేసు నమోదైంది. ఈ కేసు ఒక సహకార సంఘానికి సంబంధించినది. లక్షలాది మంది నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసిన తర్వాత ఆ డ‌బ్బు అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఈ సొసైటీ గత ఆరు సంవత్సరాలుగా ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తోంది. కానీ ప్రజలు వారి డబ్బును తిరిగి ఇవ్వాల్సి వ‌చ్చిన‌ప్పుడు చెల్లింపుల్లో విఫ‌ల‌మై, డైరెక్టర్లు పరారీలో ఉన్నారు. బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుల ప్ర‌మేయం ఎంత‌? అంటే.. ఆ ఇద్దరు నటులు ఈ సొసైటీ పెట్టుబడి పథకాలను ప్రోత్సహించారు. మరొక నటుడు సోనుసూద్ కూడా ఈ సొసైటీ కార్యక్రమాలలో ఒకదానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎఫ్ఐఆర్ వివ‌రాల‌ ప్రకారం.. `హ్యూమన్ వెల్ఫేర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ` అనే ఈ సంస్థ హర్యానా, లక్నో సహా అనేక రాష్ట్రాల్లో 16 సెప్టెంబర్ 2016న తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ సొసైటీ మధ్యప్రదేశ్‌ ఇండోర్ కేంద్రంగా మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ చట్టం కింద పనిచేస్తోంది. ఈ సొసైటీ పెట్టుబడిదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) , రికరింగ్ డిపాజిట్ (ఆర్‌.డి) పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ప్ర‌జ‌ల‌ను ఆకర్షించింది.

250 కంటే ఎక్కువ శాఖలు ఉన్న సొసైటీ అనూహ్యంగా చేతులెత్తేసింది. సొసైటీ మల్టీ-లెవల్ మార్కెటింగ్ (ఎమ్.ఎల్‌.ఎం) ఫెయిలైంది. పెద్ద ప్రోత్సాహకాలను అందిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి ప్రజల నుండి డబ్బును సేకరించింది. క్రమంగా సొసైటీ నమ్మకమైన ఆర్థిక సంస్థగా పాపుల‌రైంది. దాంతో పెట్టుబడిదారులు త‌మ‌ డబ్బు సురక్షితమ‌ని న‌మ్మారు. ఇప్పుడు 250 శాఖ‌ల‌తో 50ల‌క్ష‌ల మంది అకౌంట్ హోల్డ‌ర్లు మోస‌పోతున్నార‌ని తేలింది. ఏజెంట్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి పెట్టుబడి పెట్టమని ప్రజలను ప్రోత్సహించారని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ పని కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా ఉపయోగించారు. దీంతో పాటు స్టార్ హోటళ్లలో పెద్ద కార్యక్రమాలను నిర్వహించారు. స‌మావేశాల్లో పెట్టుబడిదారులు, ఏజెంట్లు తమ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉందని హామీ ఇచ్చారు. కానీ చివ‌రికి ప్రామిస్ విఫ‌ల‌మైంది.

Tags:    

Similar News