కాంగ్రెస్ గెలుపుకు కారణాలివేనా ?

ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిందన్నా, గెలిచిందన్నా అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇపుడు తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కొన్ని కారణాలున్నాయి.

Update: 2023-12-04 04:39 GMT

ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిందన్నా, గెలిచిందన్నా అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇపుడు తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కొన్ని కారణాలున్నాయి. అవేమిటంటే కేసీయార్, ఆయన కుటుంబంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోవటమే. ఏ పార్టీ అయినా పదేళ్ళు అధికారంలో ఉంటే జనాల్లో ఎంతోకొంత వ్యతిరేకత పెరగటం సహజమే. అయితే కేసీయార్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రస్ధాయికి చేరుకుంది. దాన్ని కేసీయార్ అండ్ కో గుర్తించటానికి ఇష్టపడకపోవటంతోనే కొంపముణిగిపోయింది.

ఇక మిగిలిన విషయాలను చూస్తే చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్ధితిలో కాంగ్రెస్ ఉంది. అందుకనే పార్టీలోని నేతలంతా ఏకతాటిపైకి వచ్చి గెలుపుకోసం తీవ్రంగా కష్టపడ్డారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంఎల్ఏల మీద జనాల్లో ఉన్న విపరీతమైన కోపం కాంగ్రెస్ కు కలిసొచ్చింది. అవినీతి, అరాచకాలకు పాల్పడిన ఎంఎల్ఏలను మార్చుంటే పరిస్ధితి ఎలాగుండేదో. అలాగే కాంగ్రెస్ పార్టీ దాదాపు ఏడాది ముందునుండే ఒక ప్రణాళిక ప్రకారం అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేసింది. బీ ఫారాలు ఇచ్చిన నేతలకు కూడా చివరినిముషంలో ఆపేసి మార్చిందంటేనే ప్రతి అభ్యర్ధి ఎంపిక విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో అర్ధమవుతోంది.

కాంగ్రెస్ ప్రకటించిన సిక్స్ గ్యారెంటీస్ జనాల్లో పాజిటివ్ సంకేతాలు పంపింది. ఇదే సమయంలో సోనియాగాంధి, రాహుల్, ప్రియాంక గాంధీలను తెలంగాణాలో ప్రచారం చేయించటం, నిరుద్యోగులు, రైతులు, యువత, మైనారిటీలకు ప్రకటించిన డిక్లరేషన్లు కూడా కాంగ్రెస్ కు సానుకూలంగా పనిచేసింది. అలాగే రేవంత్ రెడ్డి నాయకత్వం బాగా ఎఫెక్టివ్ గా ఉండటం అదనపు అడ్వాంటేజ్ అయ్యింది.

ఇక బీజేపీ కోణంలో చూస్తే పార్టీ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ ను మార్చటం పెద్ద మైనస్ అయ్యింది. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ కు చెందిన కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకుండా నరేంద్రమోడీతో కేసీయార్ లోపాయికారీ ఒప్పందం జరిగిందనే ఆరోపణలను జనాలు నమ్మారు. అందుకనే చాలామంది బీఆర్ఎస్ కు ఓట్లేయలేదు. అయితే మూడుస్ధానాల నుండి బీజేపీ 8 సీట్లకు పెరగటమే విచిత్రం,

Tags:    

Similar News