'తొలిప్రేమ' రీ రిలీజ్ గురించి దిల్‌రాజు...!
ఈమధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువ అయింది. పాత సినిమాలు, కొత్త సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతున్నాయి.;
ఈమధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువ అయింది. పాత సినిమాలు, కొత్త సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలోనే వరుసగా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. సూపర్ హిట్ సినిమాలు మాత్రమే కాకుండా ఫ్లాప్ అయిన సినిమాలు సైతం రీ రిలీజ్ అవుతున్న ట్రెండ్ నడుస్తోంది. నెలలో కనీసం నాలుగు అయిదు సినిమాల చొప్పున ప్రేక్షకుల ముందుకు రీ రిలీజ్ పేరుతో వస్తున్నాయి. ఈ నెలలోను పలు సినిమాల రీ రిలీజ్‌లు ఉన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.
మార్చి 7న రీ రిలీజ్ కాబోతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సినిమా నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించారు. మహేష్ బాబు, వెంకటేష్ వంటి ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాను తీస్తున్న సమయంలో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇద్దరికీ సమానమైన న్యాయం కల్పిస్తారా అంటూ ప్రశ్నించారు. చాలా చక్కగా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే విధంగా సినిమా వచ్చింది. రీ రిలీజ్‌కి ఉన్న ఆధరణ నేపథ్యంలో ఎక్కువ థియేటర్‌లలో సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు దిల్ రాజు పేర్కొన్నాడు.
దిల్ రాజు ఇంకా మాట్లాడుతూ... రీ రిలీజ్ అనగానే నాకు తొలి ప్రేమ సినిమా గుర్తుకు వస్తుందని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తొలి ప్రేమ సినిమాను దిల్ రాజు అప్పట్లో పంపిణీ చేశాడు. నిర్మాతగా కాక ముందు దిల్ రాజు సినిమాలను పంపిణీ చేసేవారు. తొలిప్రేమ సినిమాను పంపిణీ చేయడం ద్వారా భారీగా లాభాలు వచ్చాయని దిల్ రాజు చెప్పాడు. ఏదైనా సినిమా మాకు నష్టం మిగిల్చితే వెంటనే తొలిప్రేమ సినిమాను రీ రిలీజ్ చేసేవాళ్లం అన్నాడు. తొలిప్రేమ డిస్ట్రిబ్యూషన్ హక్కులు మాకు 5 ఏళ్లకు గాను ఉండేవి.
తొలిప్రేమ సినిమాను చాలా సార్లు రీ రిలీజ్ చేశాం. నాలుగవ సారి రీ రిలీజ్ చేసిన సమయంలో ఏకంగా రూ.12 కోట్ల షేర్ మాకు వచ్చిందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అప్పట్లో రూ.12 లక్షలు అంటే మామూలు విషయం కాదు. పవన్ సినిమాలకు ఉన్న ఆధరన, ఆ సినిమా ప్రత్యేకత నేపథ్యంలో పలు సార్లు రీ రిలీజ్ చేసినా కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యేవని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. జివిజి రాజు నిర్మించిన తొలిప్రేమ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించగా దేవా సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించగా వాసుకి ఆనంద్, నగేష్, అలీ, వేణు మాధవ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.