బంగారం స్మ‌గ్లింగ్ చేయాల‌ని బ్లాక్ మెయిల్ చేసారు.. న‌టి ఆరోప‌ణ‌

దర్యాప్తులో తనను బంగారం స్మగ్లింగ్ చేయడానికి బ్లాక్‌మెయిల్ చేశారని ర‌న్యా రావు పేర్కొన్నారు.;

Update: 2025-03-05 17:30 GMT

కన్నడ యువ నటి రన్యా రావు బంగారం స్మ‌గ్లింగ్ కేసులో అరెస్ట‌వ్వ‌డం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ర‌న్యారావును ఆదివారం సాయంత్రం కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ)లో బంగారం స్మగ్లింగ్ చేసినందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డి.ఆర్‌.ఐ) అదుపులోకి తీసుకుంది. దర్యాప్తులో తనను బంగారం స్మగ్లింగ్ చేయడానికి బ్లాక్‌మెయిల్ చేశారని ర‌న్యా రావు పేర్కొన్నారు.

కానిస్టేబుల్ బసవరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని, విమానాశ్రయంలో ర‌న్యా రావుకు సహాయం చేయడంలో అతడి ప్రమేయం గురించి వాంగ్మూలం నమోదు చేశారు. మార్చి 4న ఆమెను అరెస్టు చేసిన తర్వాత లావెల్లె రోడ్‌లోని నంద్వానీ మాన్షన్‌లోని ఆమె నివాసంపై అధికారులు దాడి చేశారు. ఈ సోదాల్లో రూ.2.67 కోట్ల నగదు, రూ.2.06 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాడి తర్వాత అధికారులు ఆమె ఇంటి నుండి మూడు పెద్ద పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఇప్ప‌టికి స్వాధీనం చేసుకున్నదాని విలువ‌ రూ.17.29 కోట్లు.

ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుండి కెంపెగౌడ విమానాశ్ర‌యంలో దిగిన తర్వాత.. నటి ర‌న్యారావు తనతో పాటు వచ్చిన పోలీసు కానిస్టేబుల్ బసవరాజు సహాయంతో భద్రతా తనిఖీలను దాటవేయడానికి ప్రయత్నించింది. అయితే ఆమె కార్యకలాపాల గురించి ముందే సమాచారం అందుకున్న డిఆర్ఐ, ఆ బంగారు వస్తువును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ర‌న్యారావును తనిఖీ చేస్తుండగా జాకెట్‌లో రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల విదేశీ బంగారం దొరికింది. అరెస్టు తర్వాత రన్యా రావును తదుపరి విచారణ కోసం నాగవరలోని డిఆర్‌ఐ కార్యాలయానికి తరలించారు.

రన్యా రావు కన్నడ, తమిళ చిత్రాలలో నటించింది. కర్ణాటక రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ డిజిపి కె రామచంద్రరావు సవతి కుమార్తె. ర‌న్యారావు తన భర్త జతిన్‌తో కలిసి దుబాయ్‌కు రెగ్యుల‌ర్ గా వెళ్లేదని అధికారులు అనుమానించారు. ఆమెకు అక్కడ ఎటువంటి వ్యాపారం లేదా కుటుంబ సంబంధాలు లేవని కూడా అనుమానించారు. విమానాశ్రయంలో భద్రతా తనిఖీలను తప్పించుకోవ‌డానికి ఆమెకు రెగ్యుల‌ర్ గా పోలీసు ఎస్కార్ట్‌లు అందుతున్నాయని దర్యాప్తులో తేలింది.

ఇటీవ రాన్యా రావు విదేశీ పర్యటనలు ఇప్పుడు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఎందుకంటే ఆమెకు దుబాయ్ లేదా ఇతర దేశాలలో ఎటువంటి వ్యాపారాలు లేవు. ఆమె భర్తను కూడా ఏజెన్సీలు ప్రశ్నించే అవకాశం ఉంది. 1962 కస్టమ్స్ చట్టం కింద ర‌న్యా రావును 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. త‌దుప‌రి విచారణ కోసం పరప్పన అగ్రహారలోని క్వారంటైన్ సెల్‌లో ఉన్నట్లు సమాచారం. న‌టీమ‌ణులు స్మ‌గ్లింగ్ చేయ‌డం అనేది చాలా సినిమాటిక్ స‌ర్ ప్రైజ్ అని చెప్పాలి.

Tags:    

Similar News