ఎవరూ శత్రువులు కారు, మిత్రులు కారు : దిల్ రాజు

ఇది ఒక వ్యాపారం. సినీ పరిశ్రమలో ఎవరికి ఎవరు శత్రువులు కారు. మిత్రులు కారు. సంక్రాంతి వచ్చినప్పుడు బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి.

Update: 2024-01-13 12:18 GMT

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మరో చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా నిన్న(జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. శ్రీలీల, మీనాక్షి చౌదరీ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు నటించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు రూ. 94 కోట్ల గ్రాస్ సాధించినట్లు మేకర్స్ తెలిపారు.

అయితే మహేశ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ వసూళ్లు ఇన్ని కోట్ల రూపాయలు రావడం ఇదే తొలిసారి. సంక్రాంతి పండగ సెలవుల నేపథ్యంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది. తాజాగా గుంటూరు కారం మూవీ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని సినిమా గురించి మాట్లాడారు.

"గుంటూరు కారం సినిమాకు ప్రజలు బాగా ఆదరించారు. తొలిరోజు వసూళ్లు.. మేం అంచనా వేసిన దాని కన్నా ఎక్కువగా వచ్చాయి. చాలా రోజుల తర్వాత రీజనల్ తెలుగు సినిమా రిలీజ్ అయింది. కొన్ని చోట్ల ఒంటి గంట షో పడిన తర్వాత మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కానీ ఫస్ట్ షో కల్లా మొత్తం పాజిటివ్ గా మారిపోయింది. ఫ్యామిలీతో వచ్చి సంక్రాంతికి ఎంజాయ్ చేసిన సినిమా గుంటూరు కారం. మహేశ్ బాబు, త్రివిక్రమ్ మార్క్ ను ఎంజాయ్ చేయండి. మీరు పక్కాగా ఎంటర్టైన్ అవుతారని హామీ ఇస్తున్నా" అని నాగవంశీ తెలిపారు.

"గుంటూరు కారం మిడ్ నైట్ షో తర్వాత సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. నేను నా అంచనాను క్రాస్ చెక్ చేసుకోడానికి సుదర్శన్ థియేటర్ లో మళ్లీ చూశాను. మదర్ అండ్ సన్ ఎమోషన్స్ తో కూడిన మూవీ గుంటూరు కారం. సుదర్శన్ థియేటర్ లో బాగా గమనించా. ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేశారు. త్రివిక్రమ్ డైలాగ్స్, మహేశ్ యాక్టింగ్, మాస్ సాంగ్ కు ఆడియెన్స్ రెస్పాన్స్ అదిరిపోయింది. బాగా లేదనే ప్రచారంతో ప్రేక్షకులు నెగిటివ్ మైండ్ తో వెళ్తున్నా.. మా సినిమా వాళ్లను ఎంటర్టైన్ చేసి మెప్పిస్తుంది. గతంలో చాలా సినిమాలు ఇలాగే మొదట డివైడ్ టాక్ వచ్చినా తర్వాత బ్లాక్ బస్టర్ అయ్యాయి. పూర్తిగా సినిమా చూసిన వాళ్లంతా బాగా కనెక్ట్ అయి పాజిటివ్ గా చెబుతున్నారు." అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.

"సినిమా వసూళ్లు పూర్తిగా పండుగ తర్వాత తెలుస్తాయి. సినిమా బాగుంటే చూస్తారు, ఎవరూ ఆపలేరు. అది చరిత్ర. ఏటా సంక్రాంతికి వార్స్ జరగడం కామన్. ఇది ఒక వ్యాపారం. సినీ పరిశ్రమలో ఎవరికి ఎవరు శత్రువులు కారు. మిత్రులు కారు. సంక్రాంతి వచ్చినప్పుడు బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి. బడ్జెట్ ఎంత, దాని ఎలా తెచ్చుకోవాలని మేకర్స్ అంతా ప్రయత్నం చేస్తారు. ఇంకా రెండు రోజుల తర్వాత ఈ టాపిక్ కోసం ఎవరూ మాట్లాడరు. కొత్త సినిమాలపైనే దృష్టి పెడతారు" అని దిల్ రాజు తెలిపారు.

Tags:    

Similar News