షాకిస్తున్న షారూఖ్ 'డంకీ' బడ్జెట్
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. డంకీ బడ్జెట్ దాదాపు 80 కోట్లు (ప్రింట్- అడ్వర్టైజ్‌మెంట్ ఛార్జీలు మినహాయించి) ఉంటుందని తెలిసింది.
పఠాన్ - జవాన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ సాధించిన షారుఖ్ ఖాన్ డంకీతో మరోసారి ఇదే ఫీట్ ని రిపీట్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఈసారి ఖాన్ భారతీయ సినీపరిశ్రమలోని అత్యుత్తమ ప్రతిభావంతులలో ఒకరైన రాజ్‌కుమార్ హిరాణీతో కలిసి పనిచేయడంతో అభిమానుల్లో డంకీపై ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. ఈ కాంబో కోసం ప్రేక్షకాభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. చాలా ఎటెంప్ట్స్ ఫెయిలయ్యాక ఖాన్ తో హిరాణీ కాంబినేషన్ కుదిరింది. డంకీ చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని ఇక వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. డంకీ బడ్జెట్ దాదాపు 80 కోట్లు (ప్రింట్- అడ్వర్టైజ్‌మెంట్ ఛార్జీలు మినహాయించి) ఉంటుందని తెలిసింది. ఇది మేకింగ్ కోసం చేసిన ఖర్చు. ఆసక్తికరంగా జవాన్ - డంకీ రెండూ షారుఖ్ ఖాన్ కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో తెరకెక్కాయి. అందుకే కింగ్ ఖాన్ తన రెమ్యూనరేషన్‌ను బాక్సాఫీస్ కలెక్షన్ల నుండి వసూలు చేస్తున్నాడని సమాచారం. కేవలం మేకింగ్ కోసం, పారితోషికాలు కలపకుండా 80కోట్లు ఖర్చయిందని చెబుతున్నారు.
అయితే ఈ విధానం కొత్తేమీ కాదు. పరిశ్రమ అగ్ర హీరోలు ఇటీవల పారితోషికాలు తీసుకోకుండా పని చేస్తున్నారు. సినిమా బిజినెస్ లో వాటాను కోరడం ద్వారా ప్రారంభంలోనే నిర్మాతకు బర్డెన్ లేకుండా చేస్తున్నారు. చిరంజీవి వంటి కొంతమంది సౌత్ స్టార్లు ప్రొడక్షన్ కాస్ట్‌ని నియంత్రించడానికి గతంలో ఇదే పద్ధతిని అనుసరించారు. ఇప్పుడు ఖాన్ అదే పద్ధతిలో పెద్ద షేర్ తీస్కుంటాడన్నమాట.
డంకీ అనేది భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో జరిగే ఒక సామాజిక కామెడీ డ్రామా చిత్రం. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ROI పరంగా బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుంది. తాప్సీ, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 21న డుంకీ సినిమా థియేటర్లలోకి వస్తోంది. జవాన్ - పఠాన్ మాదిరిగా కాకుండా, డంకీ పై క్లాస్ అప్పీల్ కలెక్షన్ల పరంగా మైనస్ అవుతుందన్న వాదన ఉంది.
150 కోట్లు మించిన బడ్జెట్లు?
షారూఖ్ ఖాన్ సినిమాలు భారీ స్థాయిలోనే కాకుండా భారీ బడ్జెట్‌తో కూడా ఉంటాయి. జవాన్ - పఠాన్ చిత్రాల బడ్జెట్లు సుమారు 150-200 కోట్ల మధ్య ఉంటుంది. అయితే డంకీ బడ్జెట్ కేవలం 80కోట్లు అని చెప్పడం గడిచిన ఆరేళ్లలో ఖాన్ కి అతి తక్కువ బడ్జెట్ చిత్రం ఇదే అవుతుందని ప్రచారం సాగుతోంది.
నటీనటులు- సిబ్బంది వసూలు చేసే రుసుమును మినహాయించి, 85 కోట్ల రూపాయలతో ఈ చిత్రం నిర్మించారనేది టాక్. హిరాణీ ఈ చిత్రాన్ని 75 రోజులు షూట్ చేయగా, అందులో ఖాన్ పై 60 రోజులు చిత్రీకరించారు. SRK చిత్రం డంకీ బడ్జెట్ రూ. 100 కోట్లలోపుకి పడిపోవడం ఆశ్చర్యం కలిగించేదే. ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన 2017 డడ్ 'జబ్ హ్యారీ మెట్ సెజల్' రూ. 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 63 కోట్లు సంపాదించింది.