స్టార్ హీరోయిన్‌కి అప్పుల కష్టాలు ఇంకెన్నాళ్లు?
ఈ సినిమా ఇప్పటికే పదే పదే వాయిదా పడుతూ వచ్చింది. సెన్సార్ గడపపై చాలా చిక్కుల్ని ఎదుర్కొని, అన్నిటికీ ముగింపు పలికి చివరికి రిలీజ్ బరిలో నిలుస్తోంది.
తన ఆస్తులన్నిటినీ తనఖా పెట్టి, ఉన్నవన్నీ కరిగించి, కొన్నిటిని అమ్మేసి చివరికి ఏదోలా సినిమా తీసింది. కానీ రాజకీయ ప్రత్యర్థుల కారణంగా ఆ సినిమా రిలీజ్ చాలా ఆలస్యమైంది. ఇప్పుడు అంతకంతకు అప్పులు పెరిగాయి. కరిగిపోయిన ఆస్తులు కళ్ల ముందే కనబడుతుంటే, అప్పులకు వడ్డీలు పెరుగుతుంటే గుండెలు బరువెక్కిపోతున్నాయి. అయినా అన్నిటినీ భరిస్తూనే ఇప్పుడు తన సినిమాని రిలీజ్ దశ వరకూ తీసుకు వచ్చింది? ఈ ఎపిసోడ్ లో సాహసి ఎవరు? అంటే నిస్సందేహంగా క్వీన్ కంగన రనౌత్. మొక్కవోని ధీక్షతో, మొండితనంతో ఏటికి ఎదురీదే లక్షణం ఉన్న కంగన రనౌత్ తనే స్వయంగా నటించి దర్శకత్వం వహించి నిర్మించిన ఎమర్జెన్సీ చిత్రాన్ని ఎట్టకేలకు రిలీజ్ కి సిద్ధం చేస్తోంది.
ఈ సినిమా ఇప్పటికే పదే పదే వాయిదా పడుతూ వచ్చింది. సెన్సార్ గడపపై చాలా చిక్కుల్ని ఎదుర్కొని, అన్నిటికీ ముగింపు పలికి చివరికి రిలీజ్ బరిలో నిలుస్తోంది. ఈ సందర్భంగా రెండో ట్రైలర్ ని రిలీజ్ చేసి ప్రజలకు మరోసారి తన సినిమాని గుర్తు చేసింది కంగన. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా లుక్ లు ఇప్పటికే ప్రేక్షకులను విస్మయానికి గురి చేసాయి. అచ్చం ఇందిరమ్మనే పోలి ఉంది అన్న ప్రశంసలు దక్కాయి. దివంగత ప్రధానమంత్రి ఇందిర బాడీ లాంగ్వేజ్, నడక తీరు, స్వరం ప్రతిదీ దోషరహితంగా తెరపై ఆవిష్కరించిందని ట్రైలర్ చూడగానే ప్రశంసలు అందుకుంది. కంగనా కేవలం ఒక పాత్రను పోషించడం మాత్రమే కాదు.. ఆ సినిమాని తన భుజస్కంధాలపై మోసింది. తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొని ధీరలా పోరాడింది.
1975 నాటి గందరగోళ పరిస్థితులను ఎమర్జెన్సీ చిత్రంలో చూపిస్తోంది. `ఇందిరా ఈజ్ ఇండియా` డిక్లరేషన్‌ను క్యాప్చర్ చేస్తూ కొత్త ట్రైలర్ ని రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ ఆవేశపూరిత నిరసనల (అనుపమ్ ఖేర్) ను.. యువ అటల్ బిహారీ వాజ్‌పేయి వక్తృత్వ ప్రజ్ఞ (శ్రేయాస్ తల్పాడే) సహా అప్పటి నాయకుల రాజకీయ చదరంగాన్ని తెరపై ఆవిష్కరించనుంది. ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా (మిలింద్ సోమన్), పుపుల్ జయకర్ (మహిమా చౌదరి), జగ్జీవన్ రామ్ (దివంగత సతీష్ కౌశిక్) పాత్రలు ఇందులో ఆకట్టుకోనున్నాయి. ఎట్టకేలకు జనవరి 17న మా ఎమర్జెన్సీ చిత్రం పెద్ద తెరపైకి రానుంది. 1975 ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రం కేవలం చారిత్రక కథాంశం మాత్రమే కాదు- ప్రజాస్వామ్యం పటిష్టతకు ప్రతిబింబం .. దానిని రక్షించడానికి పోరాడిన వారికి నివాళి... అని మేకర్స్ తెలిపారు.
కంగనా స్వయంగా రచించి, దర్శకత్వం వహించి, ముఖ్యపాత్ర పోషించిన ఎమర్జెన్సీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే, విశాఖ్ నాయర్ , దివంగత సతీష్ కౌశిక్ తదితరులు నటించారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్, రేణు పిట్టి నిర్మించారు. ఈ చిత్రం 17 జనవరి 2025న థియేటర్లలోకి రానుంది. ప్రతిష్ఠాత్మక చిత్రం రిలీజై, ఘనవిజయం సాధించి కంగన సహా నిర్మాతలలో ఆనందం నింపుతుందేమో వేచి చూడాలి.