ఎమర్జెన్సీ ట్రైలర్.. కంగనా ఇందిరా కథ
ఈ రోజులను కేంద్రంగా తీసుకొని, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఎమర్జెన్సీ సినిమా చేసింది.
భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ (1975-1977) అనేది ఎప్పటికీ మరిచిపోలేని కాలం. ఈ రోజులను కేంద్రంగా తీసుకొని, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఎమర్జెన్సీ సినిమా చేసింది.
నటిగానే కాకుండా దర్శకురాలిగా మరియు నిర్మాతగా కూడా ఆమె బిగ్ చాలంజెస్ తో సినిమాను తెరపైకి తీసుకు వస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కానుంది.
కంగనా రనౌత్ ఇందులో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటించడం, ఆమె రాజకీయ జీవితం, ప్రధానిగా ఉండగా తీసుకున్న కీలక నిర్ణయాలు, ముఖ్యంగా దేశానికి ఎమర్జెన్సీ విధించే నిర్ణయం వంటి అంశాలను ఈ చిత్రంలో ప్రదర్శించారు. ఈ చిత్రంలో కంగనా పాత్ర ఒక్కటే కాదు, ఆమె తన సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ పై కూడా ఈ చిత్రాన్ని నిర్మించారు.
దీనితో పాటు ఆమె ఈ చిత్రానికి దర్శకురాలిగా కూడా వ్యవహరించడం విశేషం. గతేడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం, వివిధ కారణాల వలన వాయిదా పడుతూ, ఈ ఏడాది సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ లో కంగనా పాత్ర చాలా పవర్ఫుల్ గా హైలెట్ అయ్యింది. 1971 ఇండో-పాక్ యుద్ధం, సిమ్లా ఒప్పందం, జయప్రకాశ్ నారాయణుడితో తీసుకున్న నిర్ణయాలు, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ తీసుకున్న చర్యలను చాలా వివరంగా చూపించారు.
‘ఇందిర అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర’ లాంటి డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందిరా గాంధీ జీవితాన్ని షేక్‌స్పియరియన్ విషాదంతో పోల్చుతూ, దాన్ని మరింత ఆసక్తికరంగా ప్రదర్శించే ప్రయత్నం చేశారు. కంగనా ఈ చిత్రంలో నటించడం మరియు ఇందిరా గాంధీ పాత్ర పోషించడం, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి చెందిన ఆమె సమీప సంబంధం వలన ఈ చిత్రంపై పలు రాజకీయ విమర్శలు, ఆసక్తులు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యేకించి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై తీసిన ఈ చిత్రం పై పలు రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, విశాక్ నాయర్, సతీష్ కౌశిక్ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ట్రైలర్ తో బాగానే ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కంగనా మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.