ఒకే ఒక్క అక్షరంతో తెరకెక్కిన సినిమాలు ఇవే!
ఈ నేపధ్యంలో గతంలో ఒక అక్షరం లేదా ఒక అంకె టైటిల్ తో తెరకెక్కిన సినిమాలేంటో చూద్దాం.
ఎలాంటి సినిమా అయినా జనాల్లోకి వెళ్ళేది ఆసక్తికరమైన 'టైటిల్'తోనే. సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించడానికి ఒక మంచి టైటిల్ పెట్టడం సినిమాకి ఎంతో అవసరం. మాములుగా కథను బట్టి, మూవీలో పాత్రలను బట్టి టైటిల్ పెడతారు. అప్పుడప్పుడు కొందరు చిత్ర విచిత్రమైన టైటిల్స్ తో వస్తుంటారు. ఈరోజుల్లో టైటిల్ కాస్త డిఫరెంట్ గా ఉంటేనే ప్రేక్షకులు ఆ మూవీపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు లేటెస్టుగా కిరణ్ అబ్బవరం కొత్త సినిమాకి 'క' అనే ఒకే ఒక్క అక్షరాన్ని టైటిల్ గా ఫిక్స్ చేశారు. దీని అర్థమేంటనేది తెలియదు కానీ, ఇది ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఈ నేపధ్యంలో గతంలో ఒక అక్షరం లేదా ఒక అంకె టైటిల్ తో తెరకెక్కిన సినిమాలేంటో చూద్దాం.
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నితిన్, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించిన 'సై' సినిమా మంచి సక్సెస్ సాధించింది. హీరో నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'అ!' అనే చిత్రం వచ్చింది. ఇందులో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బా కీలక పాత్రలు పోషించారు. నాని, సుధీర్ బాబు హీరోలుగా 'V' సినిమాని తెరకెక్కించారు ఇంద్రగంటి మోహనకృష్ణ. సముద్రఖని డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో 'బ్రో' మూవీ తెరకెక్కింది. ఇదే టైటిల్ తో అవికా గౌర్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో ఓ సినిమా రూపొందింది.
శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్ లో 'ఢీ' సినిమా ఘన విజయం సాధించింది. నందమూరి కల్యాణ్ రామ్ తన స్వీయ నిర్మాణంలో 'ఓం' అనే 3డీ మూవీ తీశారు. అదే పేరుతో గతంలో రాజశేఖర్ ఓ సినిమా చేశారు. ఇది కన్నడ నటుడు ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన 'ఓం' చిత్రానికి రీమేక్. ఆ తర్వాత 'A', 'రా...', 'ష్' వంటి ఒకే అక్షరం టైటిల్ ఉన్న సినిమాల్లో నటించారు ఉపేంద్ర. ప్రస్తుతం 'UI' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అంతకముందు సూపర్ సింబల్ తో అసలు టైటిల్ లేని చిత్రాన్ని తెరకెక్కించారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం, చియాన్ విక్రమ్ కాంబోలో 'ఐ' సినిమా వచ్చింది. అదే దర్శకుడు ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తో '2.0' చిత్రాన్ని తెరకెక్కించారు. ఐశ్వర్య రజనీకాంత్ తన మాజీ భర్త ధనుష్, శృతి హాసన్ లతో '3' సినిమా తీసింది. జగపతిబాబు 'కీ' అనే చిత్రంలో నటించారు. అదే టైటిల్ తో గతంలో జీవా, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్లుగా ఓ మూవీ రూపొందింది. అలానే జీవా, కార్తీక జంటగా కో' (తెలుగులో 'రంగం').. జీవా, నయనతార జోడీగా 'ఈ' సినిమాలు వచ్చాయి. నయనతార O2 అనే చిత్రంలో నటించింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో F2 & F3 వంటి ఫ్రాంచైజీ సినిమాలు తెరకెక్కాయి. 'గూఢచారి' సీక్వెల్ గా అడివి శేష్ తీస్తున్న చిత్రాన్ని 'G2' పేరుతో పిలుస్తున్నారు. హీరోయిన్ ఆదా శర్మ '?' (క్వశ్చన్ మార్క్) టైటిల్ తో సినిమా చేస్తే.. నందమూరి తారకరత్న 'నో' అనే చిత్రంలో నటించారు. బిగ్ బాస్ హిమజ ప్రధాన పాత్రలో 'జ'.. అదితి అరుణ్ హీరోగా 'L7' సినిమాలు వచ్చాయి. తెలుగులో 'జి' అనే జాంబీల మూవీ ఉంది. క్లూ, 9, M6 వంటి తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.