జపాన్‌లో 'దేవర' ఓపెనింగ్ కలెక్షన్స్ ఇలా..!

జపాన్‌ స్థానిక మీడియాలో వస్తున్న కథనాల అనుసారం దేవర సినిమా జపనీస్ వర్షన్‌ కి మొదటి రెండు రోజుల్లో 11 మిలియన్‌ల యెన్ల కలెక్షన్స్ నమోదు అయ్యాయి.;

Update: 2025-04-03 15:30 GMT
జపాన్‌లో దేవర ఓపెనింగ్ కలెక్షన్స్ ఇలా..!

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో రూపొంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'దేవర' సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టిన 'దేవర' సినిమాను జపాన్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. మార్చి 28న జపాన్‌లో విడులైన 'దేవర' సినిమాను ఎన్టీఆర్‌, కొరటాల శివ వెళ్లి ప్రమోట్‌ చేశారు. మూడు నాలుగు రోజుల పాటు ఎన్టీఆర్‌ జపాన్‌లో ఉండి మరీ దేవర సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ఎన్టీఆర్‌ హాజరు అయిన ప్రతి కార్యక్రమానికి, ప్రతి ప్రివ్యూ షో కి మంచి స్పందన దక్కింది. ప్రివ్యూ షో కి పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

జపాన్‌లో దేవర సినిమాకు ముందస్తు బజ్‌ క్రియేట్‌ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. దాంతో మార్చి 28న సినిమా విడుదల అయిన సమయంలో భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్నట్లు సమాచారం అందుతోంది. జపాన్‌ స్థానిక మీడియాలో వస్తున్న కథనాల అనుసారం దేవర సినిమా జపనీస్ వర్షన్‌ కి మొదటి రెండు రోజుల్లో 11 మిలియన్‌ల యెన్ల కలెక్షన్స్ నమోదు అయ్యాయి. హాలీవుడ్‌ సినిమాలు కాని విదేశీ సినిమాలకు ఇది భారీ ఓపెనింగ్‌ అంటూ స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో సినిమాకు అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. లాంగ్ రన్‌లో సినిమా కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని టాక్‌ వినిపిస్తుంది.

ఎన్టీఆర్‌ స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొనడం కలిసి వచ్చిందని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్‌ రెండు మూడు రోజులు చేసిన ప్రమోషన్ కార్యక్రమాలు అక్కడి ప్రేక్షకుల్లోకి దేవర సినిమాను తీసుకు వెళ్లింది. ప్రతి చోట సినిమా ప్రమోషన్‌ ఎంత కీలకంగా పని చేస్తుందో మరోసారి దేవర ఫలితాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆమధ్య ఒక స్టార్‌ హీరో తెలుగు సినిమాను భారీ ఎత్తున విడుదల చేశారు. కానీ ప్రమోషన్‌ పెద్దగా చేయక పోవడంతో, ఆ హీరోకు మంచి ఫాలోయింగ్‌ ఉన్నప్పటికీ ఆయన అక్కడకు వెళ్లక పోవడంతో పెద్దగా వసూళ్లు నమోదు చేయలేక పోయింది. కానీ దేవర సినిమా విషయంలో ఆ తప్పు జరగలేదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేవర సినిమా ఓపెనింగ్‌ విషయంలో మేకర్స్‌ సంతృప్తిగా ఉన్నారు. అయితే లాంగ్‌ రన్‌లో వసూళ్లు ఎలా ఉంటాయా అనేది ఆసక్తిగా మారింది. బాహుబలి 2 జపాన్‌లో 305 మిలియన్‌ల యెన్లు సాధించింది. లాంగ్‌ రన్‌లో ఆ స్థాయి వసూళ్లను దేవర దక్కించుకుంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. జపాన్‌లో వసూళ్లు మెల్లగా పెరుగుతూ ఉంటాయి. సినిమాకు వచ్చే టాక్‌ను అనుసారం సినిమా వసూళ్లు నమోదు అవుతూ ఉంటాయి. కనుక మెల్ల మెల్లగా దేవర జపనీస్ వర్షన్‌ కలెక్షన్స్‌ పెరుగుతూ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఎన్టీఆర్‌ త్వరలో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూట్‌లో జాయిన్‌ కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. మరో వైపు వార్‌ 2 తో ఎన్టీఆర్‌ ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

Tags:    

Similar News