గేమ్‌ ఛేంజర్‌ : ఇది చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ముప్పు

గేమ్‌ ఛేంజర్‌ సినిమా లీక్ అయ్యి బస్సుల్లో, లోకల్‌ ఛానల్స్‌లో ప్రసారం కావడంపై నిర్మాత ఎస్‌కేఎన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

Update: 2025-01-15 08:30 GMT

రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబోలో దిల్‌ రాజు నిర్మించిన 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన రెండు రోజుల్లోనే పైరసీ బయటకు వచ్చేసింది. హై క్వాలిటీ ప్రింట్‌ బయటకు రావడంతో పాటు లోకల్‌ ఛానల్స్‌, బస్‌ల్లో ఈ సినిమాను టెలికాస్ట్‌ చేస్తున్నారు. దాంతో థియేటర్‌కి జనాలు ఎలా వస్తారు అంటూ ఫ్యాన్స్‌తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలను ఛాలెంజ్ చేసి మరీ సినిమాను పైరసీ చేసిన వారి గురించి ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్నారు. సోషల్‌ మీడియా అకౌంట్స్ ఆధారంగా వారిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

గేమ్‌ ఛేంజర్‌ సినిమా లీక్ అయ్యి బస్సుల్లో, లోకల్‌ ఛానల్స్‌లో ప్రసారం కావడంపై నిర్మాత ఎస్‌కేఎన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సోషల్‌ మీడియా ద్వారా ఆయన స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో ఇది అత్యంత బాధాకరమైన విషయంగా ఆయన పేర్కొన్నారు. 5 రోజుల క్రితం వచ్చిన సినిమాను అప్పుడే లోకల్‌ ఛానల్‌లో, బస్‌ల్లో ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ ఫామ్‌ల్లో చూడటం చాలా బాధగా ఉంది. ఇలా లీక్ కావడం చిన్న విషయం కాదు. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. సినిమా అంటే కేవలం నిర్మాత డబ్బు పెట్టడం, హీరో నటించడం, దర్శకుడు తీయడం మాత్రమే కాదు. ఈ సినిమా కోసం వేలాది మంది మూడు నాలుగు ఏళ్లు కష్టపడ్డారు.

సినిమాను లీక్‌ చేసే ముందు, సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసే ముందు సినిమానే జీవితంగా జీవిస్తున్న వేలాది మంది గురించి ఆలోచించండి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్‌ గురించి కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా సినిమాలను లీక్ చేయడం వల్ల చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. సినిమా లీక్‌కి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వాలు కొంతలో కొంత అయినా భరోసా కలిగించినట్లు అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

రామ్‌ చరణ్‌ డ్యూయెల్‌ రోల్‌ లో నటించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమాను దాదాపుగా నాలుగు ఏళ్ల పాటు నిర్మించారు. దిల్‌ రాజు ఈ సినిమాకు రూ.500 కోట్లను ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇంతటి భారీ బడ్జెట్‌ సినిమాలను ఇలా మొదటి రెండు మూడు రోజుల్లోనే లీక్‌ చేస్తే ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చేది ఎలా, నిర్మాతలు పెట్టిన పెట్టుబడి వచ్చేది ఎలా అంటూ సగటు సినీ ప్రేమికుడు సైతం ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ప్రభుత్వాలు ఈ విషయమై సీరియస్‌గా తీసుకుంటే తప్పితే ముందు ముందు ఇలాంటివి జరగవు. గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఇండస్ట్రీ మొత్తం గొంతు విప్పాల్సిన సమయం ఇది. కానీ కొద్ది మంది మాత్రమే ఈ విషయమై స్పందిస్తున్నారు.

Tags:    

Similar News