'అనుజా'తో గునీత్ ఆస్కార్ హ్యాట్రిక్ అందుకుంటుందా?
ఈ నేపథ్యంలోనే భారతదేశం తరపున 97వ అకాడెమీ నామినేషన్లకు లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అనుజా అనే షార్ట్ ఫిల్మ్ ఎంపికైంది.
సినిమాలంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, సినిమాల ద్వారా ఎంతోమంది ఆడియన్స్ ఎన్నో సందర్బాల్లో ప్రభావితం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సామాజికాంశాలతో రూపొందిన సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాకపోయినా జీవితంలో హార్డ్ సిట్యుయేషన్స్ లో ఎలా ముందుకెళ్లాలో వాటి నుంచి నేర్చుకోవచ్చు.
ఈ నేపథ్యంలోనే భారతదేశం తరపున 97వ అకాడెమీ నామినేషన్లకు లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అనుజా అనే షార్ట్ ఫిల్మ్ ఎంపికైంది. ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వంలో ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందింది. బాల కార్మికులు, వారి బతుకు పోరాటాలను అనూజాలో కళ్లకు కట్టినట్టు చూపించారు.
తొమ్మిదేళ్ల అనుజా కు బోర్డింగ్ స్కూల్ లో చదువుకోవాలని కోరిక. కానీ ఆర్థిక స్థోమత లేకపోవడంతో అక్కతో కలిసి బట్టల ఫ్యాక్టరీలో పనికి వెళ్తుంటుంది. చదువుకు సంబంధించిన పలు విషయాల్ని తన అక్క దగ్గర తెలుసుకున్న అనుజాకి చదువుకోవాలనే కోరిక ఇంకా పెరుగుతుంది. ఒకనొక టైమ్ లో అనుజాకి స్కూల్ లో చదువుకునే అవకాశమొస్తుంది. కానీ ఇంట్లో పరిస్థితి మాత్రం రెక్కాడితే డొక్కడదు.
ఇలాంటి సిట్యుయేషన్స్ లో అనుజా స్కూల్ లో జాయినైందా లేదా ఫ్యామిలీ కోసం వెనుకడుగేసిందా అనే దానిపై కథ నడుస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా గునీత్ మోంగా, సుచిత్రా మిట్టల్, మిండీ కాలింగ్ నిర్మించారు. ఇందులో అనుజాగా నటించిన సజ్దా పఠాన్ నిజ జీవితంలో కూడా ఇంచుమించు ఇలాంటి జీవితాన్నే అనుభవించింది. బాలకార్మికురాలిగా నలిగిపోతున్న సజ్దాను సలామ్ బాలక్ ట్రస్ట్ చేరదీసి అండగా నిలిచింది. ఆ ట్రస్ట్ సహకారంతోనే చదువుకుంటూనే సినీ రంగంలోకి అడుగుపెట్టింది సజ్దా.
ఇదిలా ఉంటే గునీత్ మోంగా ఇప్పటికే రెండు సార్లు ఇండియా తరపున ఆస్కార్ వేదికపై నిలిచి అందరి ప్రశంసలందుకున్నారు. ఇప్పుడు అనుజా తో మరోసారి ఆ వేదికపై అడుగుపెట్టనున్నారు గునీత్ మోంగా. ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి అందరితో శభాష్ అనిపించుకున్న ఆమె మొదటిసారి 2019లో పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే సినిమాకు, 2023లో ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే షార్ట్ ఫిల్మ్ కు ఎంపికయ్యారు. మరి 97వ ఆస్కార్ పురస్కారాల్లో గెలిచి హ్యాట్రిక్ అందుకుంటుందో లేదో చూడాలి.