పవన్ పాటలు రెండు రిలీజయ్యాయి తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నుంచి పాటలు రిలీజవుతుంటే.. సోషల్ మీడియాలో ఉండే హంగామానే వేరు.

Update: 2025-02-25 20:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నుంచి పాటలు రిలీజవుతుంటే.. సోషల్ మీడియాలో ఉండే హంగామానే వేరు. లీస్ట్ హైప్ ఉన్న సినిమాల నుంచి అయినా సరే.. పవన్ సాంగ్స్ వస్తే స్పందన మామూలుగా ఉండదు. రీమేక్ మూవీస్ అయిన.. పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేని వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి చిత్రాల నుంచి సాంగ్స్ రిలీజైనపుడు కూడా సోషల్ మీడియాలో బాగా సందడి కనిపించింది.

వాటి పాటలు సంగీత ప్రియులను బాగానే ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పుడు పవన్ కొత్త చిత్రం ‘హరి హర వీరమల్లు’ నుంచి రెండు పాటలు రిలీజైనా.. అసలు సౌండ్ లేదు. ఇందులో పవన్ స్వయంగా పాడిన ఓ పాట ఉండడం విశేషం. గత నెలలో ‘మాట వినాలి..’ అంటూ పవన్ పాడిన ఓ పాటను రిలీజ్ చేశారు.

పవర్ స్టార్ గాత్రం నుంచి వచ్చిన సాంగ్ అంటే మామూలుగా సోషల్ మీడియా మోత మోగిపోవాలి. కానీ ఈ పాట విషయంలో స్పందన అంతంతమాత్రమే. ఆ సాంగ్‌లో అభిమానులు ఆశించినంత ఊపు లేకపోవడం ఇందుకు ఓ కారణం కావచ్చు. ఇక తాజాగా ‘కొల్లగొట్టినాదిరో..’ అంటూ ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్; నిధి అగర్వాల్‌లతో పాటు అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ కూడా కనిపించారు.

సాంగ్ విజువల్స్ కూడా బాగున్నాయి. కానీ ఈ పాటలోనూ పవన్ అభిమానులు కోరుకున్న ఊపు కనిపించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే లక్షణాలు ఈ రెండు పాటల్లోనూ కొరవడ్డాయి. రాజమౌళి సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చే కీరవాణి.. ఈ సినిమా పాటలకు న్యాయం చేయలేకపోయారే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ‘హరి హర వీరమల్లు’ బాగా ఆలస్యం కావడం వల్ల ఒకప్పుడు దీనికి ఉన్న హైప్ ఇప్పుడు కనిపించడం లేదు. మేకర్స్ ప్రకటించినట్లుగా మార్చి 28న కూడా రిలీజవడం సందేహంగా ఉండడం వల్ల అభిమానుల్లో అంతగా సినిమా పట్ల ఆసక్తి కనిపించడం లేదు. దీనికి తోడు సాంగ్స్‌లో ఊపు లేకపోవడం వల్ల కూడా వ్యూస్ తక్కువగా ఉన్నాయి., సోషల్ మీడియాలో ఈ పాటల గురించి పెద్దగా డిస్కషన్లూ కనిపించడం లేదు.

Tags:    

Similar News