హర్షసాయి పౌండేషన్ పై పోలీస్ కేసు!
ఓ సినిమా విషయంలో తనపై లైంగిక దాడి చేసినట్లు పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి అతడిపై మరో కేసు పెట్టింది.
ఫేమస్ యూట్యూబర్ హర్షసాయికి మరో గట్టి షాక్ తగిలింది. అతడి పౌండేషన్ పై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సహాయం పేరుతో 5.4 లక్షలు వసూళ్లకు పాల్పడి మోసం చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేసాడు. దీంతో హర్షసాయిపై వివిధ సెక్షన్ల కింద కొత్త కేసులు నమోదు చేసారు. ఇప్పటికే హర్షసాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లైంగిక ఆరోపణల కేసు ఫైల్ అయిన సంగతి తెలిసిందే.
ఓ సినిమా విషయంలో తనపై లైంగిక దాడి చేసినట్లు పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి అతడిపై మరో కేసు పెట్టింది. హర్షసాయిపై ఫిర్యాదు చేసినప్పటి నుంచి తనను మరింత టార్చర్ చేస్తున్నాడని మెయిల్స్ ద్వారా మానసికంగా హింసిస్తున్నాడని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మరో కేసు కూడా ఫైల్ చేసింది.
దీంతో అప్పటికే హర్షసాయి పరారీలో ఉన్నాడు. అతడి కోసం కొన్నిరోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయాలని సదరు యువతి పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. మరో వైపు హర్షసాయి బాధితులు ఇంకా చాలా మంది ఉంటారని అతడి వ్యతిరేక వర్గం ఆరోపిస్తుంది. ఆ యువతి తరుపున లాయర్ కూడా ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
అలాగే హర్షసాయి అప్పట్లో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీటిని ప్రమోట్ చేయడంపై తనని తాను సమర్దించుకున్నాడు. చట్టపరంగా ఉన్న అంశాల్ని ప్రస్తావించాడు. దీంతో అప్పట్లో దిశాకి అంబాసిడర్‌గా ఉన్న అతడిని ప్రభుత్వం తొలగించింది.