మైత్రిలో ఐటీ దడ.. అసలు డౌట్స్ ఎక్కడ మొదలయ్యాయి?

పుష్ప 2 సినిమా వసూళ్లు, పెట్టుబడులపై విచారణ చేపట్టేందుకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Update: 2025-01-21 21:30 GMT

టాలీవుడ్‌లో పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాలను అందించిన మైత్రి మూవీ మేకర్స్ తాజాగా ఆదాయపు పన్ను శాఖ దృష్టిలో పడింది. పుష్ప 2 సినిమా వసూళ్లు, పెట్టుబడులపై విచారణ చేపట్టేందుకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజు, అభిషేక్ అగర్వాల్, వృద్ది సినిమాస్ వంటి ఇతర ప్రముఖ సంస్థలతో పాటు మైత్రి సంస్థపై జరిగిన ఈ దాడులు, టాలీవుడ్‌లో గల ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా కుదిపేసాయి.

పుష్ప 2 విడుదల సమయంలో ప్రచారం చేసిన రూ. 2000 కోట్ల కలెక్షన్ల పోస్టర్లకు సంబంధించిన డేటాను ఐటీ అధికారులు విశ్లేషిస్తున్నారు. సినిమా కోసం పెట్టుబడులు ఎలా సమీకరించారు? వాటిని ఎకౌంట్స్ లో సరైన పద్దతిలో చూపించారా? వంటి ప్రశ్నలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్‌లకు చేసిన భారీ రెమ్యునరేషన్, షేర్ల చెల్లింపుల లెక్కలు దర్యాప్తు పరిధిలోకి వచ్చాయి. ఈ చెల్లింపుల్లో ఏమైనా అకౌంటింగ్ లోపాలు ఉన్నాయా అని అధికారులు సందేహిస్తున్నారు.

మైత్రి నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నివాసాలు, కార్యాలయాలపై సోదాలు కొనసాగుతున్నాయి. వీరితో పాటు మైత్రి భాగస్వామి వెంకట సతీష్ కిలారు కూడా దర్యాప్తులో ఉన్నారు. ఆయన భాగస్వామిగా ఉన్న వృద్ది ఇన్‌ఫ్రాటెక్ సంస్థలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సంస్థల ఆర్థిక లావాదేవీల పట్ల తీవ్ర విచారణ జరుగుతున్నట్టు సమాచారం.

మైత్రి సంస్థలో సినిమాల మార్కెటింగ్ బాధ్యతలు చూసే వ్యక్తి వివరాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ వ్యక్తి మైత్రి సంస్థ లావాదేవీలపై కీలక సమాచారం కలిగి ఉన్నారని ఐటీ శాఖ అనుమానిస్తోంది. అలాగే మైత్రి, దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ వంటి సంస్థలకు నియమిత ఫైనాన్షియర్ అయిన సత్య రంగయ్య కూడా విచారణలో ఉన్నారు. ఆయన అనధికారిక చెల్లింపులు చేశారా లేదా అన్నది పెద్ద చర్చగా మారింది.

ఈ దాడులు మైత్రి సంస్థతో పాటు టాలీవుడ్‌లోని పలు ప్రధాన సంస్థలను కలవరపరుస్తున్నాయి. ప్రత్యేక సమాచారం ఆధారంగా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజులు ఈ దాడులు కొనసాగే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్‌లో పెద్ద బడ్జెట్ సినిమాలకు పెట్టుబడులు సమీకరించడంలో లెక్కలు తారుమారు కావడం ఈ దాడులకు కారణంగా కనిపిస్తోంది. పుష్ప 2 వంటి భారీ ప్రాజెక్ట్ విజయవంతమైనా, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత ఉన్నట్లు నిరూపించడమే మైత్రి సంస్థకు కీలకం కానుంది.

Tags:    

Similar News