'కంగువ' మూవీ రివ్యూ
నటీనటులు: సూర్య-బాబీ డియోల్-దిశా పటాని-యోగిబాబు-నటరాజన్ సుబ్రహ్మణ్యన్-యోగిబాబు-కె.ఎస్.రవికుమార్-కోవై సరళ-రెడిన్ కింగ్స్స్లీ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: వెట్రి పళనిస్వామి
నిర్మాతలు: జ్ఞానవేల్ రాజా-వంశీ-ప్రమోద్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శివ
తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరో.. సూర్య. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో.. భారీ స్థాయిలో తెరకెక్కిన చిత్రం.. కంగువ. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళ బాహుబలిగా అభివర్ణించారు అక్కడి ట్రేడ్ పండిట్లు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. నిజంగా ఆ స్థాయిని అందుకునేలా ఉందా? చూద్దాం పదండి.
కథ:
1900 ఏళ్ల కిందట భారత దేశానికి సరిహద్దుల్లో అయిదు తెగలకు చెందిన మనుషులు.. వేర్వేరుగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని బతుకుతుంటారు. ఆ ఐదు తెగలకు తమకంటూ ప్రత్యేకమైన లక్షణాలు.. సంప్రదాయాలు ఉంటాయి. వీటిలో ప్రణవాది కోన ప్రత్యేకం. వారిలో వీరత్వమే కాక మంచి లక్షణాలూ ఉంటాయి. ఈ తెగకు నాయకత్వం వహిస్తుంటాడు కంగువ (సూర్య). ఐతే రొమేనియాకు చెందిన సైన్యం భారత దేశాన్ని చేజిక్కించుకునే లక్ష్యంతో సముద్రం ద్వారా సరిహద్దులకు వచ్చి తమ స్థావరం ఏర్పాటు చేయడానికి ఈ ఐదు కోనల్లో ఒకదాన్ని నాశనం చేయాలనుకుంటుంది. ప్రణవాది కోన మీద ఆ సైన్యం దృష్టిపడి.. ఆ కోనను అంతం చేసేందుకు కపాల కోనకు చెందిన నాయకుడు రుధిరతో చేతులు కలుపుతుంది. దీంతో ఆ రెండు కోనల మధ్య వైరం మొదలై యుద్ధానికి దారి తీస్తుంది. మరి ఈ పోరులో ఎవరు గెలిచారు.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
'బాహుబలి: ది కంక్లూజన్'లో భల్లాల దేవుడి కోటలోకి తన సైన్యంతో ఎలా అడుగు పెట్టాలా అని ఆలోచించిన మహేంద్ర బాహుబలి.. తాటి చెట్లను విల్లులాగా వంచి వాటి ద్వారా తన సైన్యాన్ని కోటలోకి చేర్చే ఒక సన్నివేశం ఉంటుంది. నిటారుగా ఉండే తాటి చెట్టును అలా వంచడం అన్నది అసాధ్యమైన విషయం. ఐతే ఫిజిక్స్ సూత్రాల్లో అస్సలు ఇమడని ఈ సీన్ చూసి ప్రేక్షకులు ఇదేం లాజిక్ అనుకోరు. సినిమాలో లీనం అయిపోయినపుడు.. అందులోని ఎమోషన్ కు కనెక్ట్ అయినపుడు.. ఇలాంటి లాజిక్ కు అందని విషయాలు కూడా గమ్మత్తుగా అనిపిస్తాయి. కానీ సినిమా ప్రేక్షకులను లీనం చేయనపుడు.. అందులోని ఎమోషన్ వర్కవుట్ కానపుడు.. ప్రతిదీ విడ్డూరంగా అనిపించి లాజిక్కులు వెతకాలనిపిస్తుంది. తమిళ సినిమాకు 'బాహుబలి' కాగలదనే అంచనాలున్న 'కంగువ' చూస్తున్నపుడు చాలా చోట్ల ఇలాంటి ఫీలింగే కలిగితే ఆశ్చర్యం లేదు. నీటిలో వెయ్యేనుగుల బలం ఉంటుందని చెప్పే మొసలిని హీరో అలవోకగా చిన్న కత్తి పుచ్చుకుని చంపేస్తుంటే.. కారడవిలో వందల మంది శత్రు సైన్యాన్ని సునాయాసంగా మట్టు పెడుతుంటే.. ఆకాశం నడి మధ్యలో వార్ ప్లేన్ నుంచి వేలాడుతున్న వాడు వెనక్కి వచ్చి అందులో ఉన్న వాళ్లందరినీ అంతం చేస్తుంటే.. ఆ సన్నివేశాలు వెటకారంగా అనిపిస్తాయంటే అందుక్కారణం.. 'కంగువ' కథకు.. అందులోని ఎమోషన్ కు ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవడం వల్లే. ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి థ్రిల్ చేయడానికి శివ అండ్ టీం చాలానే కష్టపడింది కానీ.. ఆ ప్రపంచంలో ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టి విహరింపజేయడంలో మాత్రం విఫలమైంది.
సెట్టింగ్స్.. స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి.. నటీనటుల వేషధారణలు మార్చి.. భాష-యాసలోనూ వైవిధ్యం చూపించి.. విజువల్ గ్రాండియర్ కూడా జోడించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం ద్వారా బాక్సాఫీస్ ను కొల్లగొట్టడం ఇప్పుడు ట్రెండ్. 'బాహుబలి'తో ఊపందుకున్న ఈ ట్రెండును చాలా సినిమాలు అనుసరించాయి. కానీ అన్ని చిత్రాలూ ప్రేక్షకులకు రసానుభూతిని కలిగించలేకపోయాయి. 'కంగువ' టీం ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇవ్వడానికి చాలా కష్టపడిన మాట వాస్తవం. 1900 ఏళ్ల వెనక్కి వెళ్లి తెగలు.. కోనలు అంటూ డిఫరెంట్ సెటప్ తో కథ రాసుకున్నాడు శివ. విజువల్ గా ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లేలా ఈ సెటప్ బాగానే కుదిరింది. సూర్య-బాబీ డియోల్ లాంటి అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న హీరో-విలన్ ను ఎంచుకోవడమూ బాగుంది. కానీ సెటప్ అంతా డిఫరెంటుగా అనిపించినా.. కథ కొత్తగా లేకపోవడం.. ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేసే బలమైన ఎమోషన్ లేకపోవడం 'కంగువ'కు మైనస్ గా మారింది.
ఈ కథ అంతా ఒక పిల్లాడి చుట్టూ తిరుగుతుంది. ఆ పిల్లాడి తండ్రి హీరో చేతిలో చనిపోతాడు. కానీ అతను చనిపోవడానికి సరైన కారణమే ఉంటుంది. ఐతే ఆ పిల్లాడు హీరోను ద్వేషిస్తాడు. ఈ ఎమోషన్ మీదే కథంతా నడుస్తుంది. కానీ హీరో చేసిన దాంట్లో తప్పు కనిపించదు. ప్రమాదంలో ఉన్న ఆ పిల్లాడిని కాపాడ్డానికి హీరో చేసే సాహసంలో బలమైన ఎమోషన్ ఉండదు. ఇక హీరోకు.. విలన్ కు మధ్య శత్రుత్వం ఏర్పడేలా బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో దర్శకుడు శివ విఫలమయ్యాడు. బాబీ డియోల్ చేసిన విలన్ పాత్ర లుక్స్ పరంగా వయొలెంట్ గా కనిపిస్తుంది కానీ.. విషయ పరంగా అది భీకరంగా ఏమీ అనిపించదు. హీరో-విలన్ మధ్య వైరంలో బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింటే కనిపించకపోవడం సినిమాకు పెద్ద మైనస్. విదేశీ సైన్యం రెండు తెగల మధ్య చిచ్చు పెట్టే విషయాన్ని కూడా బలంగా చూపించలేకపోయారు. కథ పరంగా ఏదైనా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినా సరే.. ఆ ప్రపంచం నమ్మశక్యంగా అనిపించడం.. అందులో మనం ఉన్న ఫీలింగ్ కలిగిస్తూ పాత్రలతో ట్రావెల్ అయ్యేలా చేయడం కీలకం. 'కంగువ' ఈ విషయంలో ఫెయిలైందనే చెప్పాలి. ఇందులో చూపించే ప్రపంచం.. మనుషులు కృత్రిమం అనే భావన కలుగుతుంది. పోనీ ఫాంటసీ సినిమాల్లో మాదిరి అక్కడ జరిగేది గొప్పగా అనిపించి ప్రేక్షకులు అబ్బురపడేలా చేశారా అంటే అదీ లేదు. ఆద్యంతం ఏదో మిస్ అయిన ఫీలింగే కలుగుతుంది.
'కంగువ'లో కథను చెప్పే విధానం.. పాత్రలను డిజైన్ చేసిన తీరు.. సన్నివేశాలు నడిచే వైనం.. అన్నీ కూడా చాలా లౌడ్ గా... హడావుడిగా.. గందరగోళంగా అనిపిస్తాయి. విజువల్ గా సన్నివేశాలు బాగున్నా.. కథ అయితే అంత ఆసక్తికరంగా నడవదు. కంగువ పాత్ర పరిచయానికి సంబంధించిన ఎపిసోడ్ ఒక్కటి కొంచెం ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. రొమేనియా సైన్యం కోసం జరిగిన కుట్రలో భాగంగా కంగువ తెగకు చెందిన వంద మందిని మట్టుబెట్టే ఎపిసోడ్.. దానికి హీరో ప్రతీకారం తీర్చుకునే సీన్.. 'కంగువ' మీద అంచనాలు పెంచుతాయి. ఇంట్రోనే ఇలా ఉంటే ఇక అసలు కథలోకి వెళ్తే ఇంకెలా ఉంటుందో అనే ఎగ్జైట్మెంట్ కలుగుతుంది. కానీ ఆ తర్వాత కథ ఆసక్తికరంగా నడవదు. దీని కంటే ముందు వర్తమానంలో నడిచే కథ కొంతసేపే అయినా.. అదిప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. కంగువ ఎంట్రీ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి భారీ ఎపిసోడ్లు వస్తుంటాయి కానీ.. అవి అంత ఆసక్తి రేకెత్తించవు. విలన్ పాత్రకు మొదట్లో ఇచ్చిన బిల్డప్ కు.. తర్వాత ఆ పాత్ర సాగే తీరుకు పొంతన ఉండదు. ఇక చిన్న పిల్లాడి చుట్టూ చాలా కథను నడిపించారు కానీ.. అది విసుగెత్తించేలా ఉంటుంది. పతాక సన్నివేశాలకు ముందు బిల్డప్ కూడా సరిగా జరగలేదు. మరీ విచిత్రంగా అనిపించే వేషధారణతో.. అతిగా స్పందించే ఆ మనుషులను చూస్తున్నకొద్దీ వికారం పుడుతుంది. అందుకే ఒక దశ దాటాక 'కంగువ' ప్రపంచం చిరాగ్గా అనిపిస్తుంది. ప్రి క్లైమాక్సులో 'కంగువ'కు అవసరమైన బిల్డప్ కనిపించదు. పతాక సన్నివేశాలను భారీగానే తీర్చిదిద్దినా అవి ఆశించిన కిక్కు ఇవ్వలేకపోయాయి. కార్తిని తెరపైకి తీసుకొచ్చి సెకండ్ పార్ట్ కు మంచి లీడే ఇచ్చినా.. పార్ట్-1 మజానివ్వకపోవడంతో దాని మీద అంతగా ఆసక్తి కలగదు. మొత్తంగా చూస్తే నిర్మాతల సహకారంతో సూర్య-శివ కలిసి ఎంతో కష్టపడి ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు కానీ.. ఆ ప్రపంచం ఆశించిన వినోదాన్ని మాత్రం అందించలేకపోయింది. సూర్య పెర్ఫామెన్స్.. విజువల్స్ కోసం 'కంగువ'పై ఓ లుక్కేయొచ్చు కానీ.. కొంచెం ఓపిక ఉండాలి.
నటీనటులు:
సూర్య ఎలాంటి పెర్ఫార్మరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కంగువ పాత్ర కోసం అతను ప్రాణం పెట్టేశాడు. తన లుక్.. హావభావాలు.. ఓవరాల్ పెర్ఫామెన్స్ అన్నీ సూపరే. తన కళ్లలోని ఇంటెన్సిటీ కంగువ పాత్రను ప్రత్యేకంగా మార్చింది. సూర్యకు గెటప్ బాగా కుదిరింది. తన నటనతో ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించాడు సూర్య. కానీ మిగతా ఆర్టిస్టులు తనను మ్యాచ్ చేయలేకపోయారు. బాబీ డియోల్ కు గెటప్ బాగానే కుదిరినా.. తన పాత్ర తేలిపోవడంతో అనుకున్న ఇంపాక్ట్ రాలేదు. బాబీ పెర్ఫామెన్స్ అయితే ఓకే. హీరోయిన్ దిశా పటాని మరోసారి కరివేపాకు టైపు పాత్ర చేసింది. ఒక పాటలో ఆమె గ్లామర్ విందు చేసింది. కమెడియన్లు యోగిబాబు.. రెడిన్ నవ్వులు పంచలేకపోయారు. కథలో కీలకమైన పాత్రలో నటించిన చిన్న పిల్లాడు బాగానే చేశాడు. నటరాజన్ సుబ్రహ్మణ్యన్ ముఖ్య పాత్రలో రాణించాడు. సూర్య తండ్రి పాత్రలో కనిపించిన కేజీఎఫ్ నటుడు ఓకే. కార్తి క్యామియో పాత్రలో కనిపించిన కొన్ని నిమిషాలు అదరగొట్టేశాడు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా 'కంగువ'లో ఉన్నత ప్రమాణాలు కనిపిస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటలు మంచి ఊపునిస్తాయి. మన్నింపు పాట అన్నింట్లోకి ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతా పాటలు కూడా సినిమాలో బాగానే ఇమిడిపోయాయి. ఆది జ్వాల పాట వినడానికే కాదు.. చూడ్డానికి కూడా బాగుంది. నేపథ్య సంగీతం మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తుంజది. కొన్ని చోట్ల గూస్ బంప్స్ ఇచ్చినా.. కొన్ని చోట్ల మామూలుగా అనిపిస్తుంది. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ సూపర్. ఆర్ట్ వర్క్ గొప్పగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఓకే. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. భారీగా ఖర్చు పెట్టారు. ఐతే రైటర్ కమ్ డైరెక్టర్ శివ కష్టాన్ని తక్కువ చేయలేం కానీ.. అతను ఎంచుకున్న కథ అంత ఎంగేజింగ్ గా అనిపించదు. నరేషన్ కూడా చాలా గందరగోళంగా.. లౌడ్ గా సాగింది. కొన్ని ఎపిసోడ్ల వరకు శివ ఎంగేజ్ చేయగలిగాడు కానీ.. ఓవరాల్ గా ఈ కథను.. ఇందులో అతను చూపించిన ప్రపంచాన్ని ప్రేక్షకులు ఓన్ చేసుకునేలా చేయడంలో విఫలమయ్యాడు. గజిబిజిగా.. లౌడ్ గా సాగే తన నరేషన్ సినిమాకు మైనస్ అయింది.
చివరగా: కంగువ.. మురిపించని మరో ప్రపంచం
రేటింగ్- 2.25/5