కన్నప్ప టీజర్ 2: అంతటి నాస్తికుడు మీకు భక్తుడు అవుతాడా?
మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతున్న కన్నప్ప చిత్రం నుంచి రెండో టీజర్ విడుదలైంది.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతున్న కన్నప్ప చిత్రం నుంచి రెండో టీజర్ విడుదలైంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా మూవీపై మేకర్స్ అంచనాలు క్రియేట్ అయ్యేలా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఒక టీజర్ వచ్చింది. అలాగే సాంగ్ కూడా రిలీజ్ కాగా ఇప్పుడు రెండో టీజర్ ను విడుదల చేశారు. సినిమాలో ప్రముఖ పాత్రలన్నింటిని ఇందులో హైలెట్ చేశారు.
ముఖ్యంగా విష్ణు పాత్రలోని పవర్‌ఫుల్ సీన్లు, శివుడిగా అక్షయ్ కుమార్ లుక్, ఆఖరిలో ప్రభాస్ విజువల్ హైలైట్‌గా నిలిచాయి. "గూడాల మీద గండాలు దండెత్తుకొస్తున్నాయి. శత్రువులు యమకింకొరలై గూడెం మీద పడబోతున్నారు.." అంటూ టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత మోహన్ బాబు గంభీరమైన స్వరంలో, "శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది.." అంటూ చెప్పిన డైలాగ్‌తో హీరో పాత్ర ఎంట్రీ అవ్వడం సినిమాలో ప్రధాన పాయింట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
విష్ణు కన్నప్ప పాత్రలో విలన్స్ పై బాణాలు సందిస్తూ ఎంట్రీ ఇచ్చాడు. "వాళ్లు వేలల్లో కాదు లక్షల్లో రానివ్వండి.. తేల్చుకుందాం.." అంటూ చెప్పిన డైలాగ్, ఫైట్ సీక్వెన్స్‌ను హైలైట్ చేస్తుంది. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. టీజర్‌లో ఆయన లుక్ రివీల్ చేయడం ఆసక్తికరంగా మారింది.
పార్వతీగా కాజల్ అగర్వాల్ కనిపించనుండగా, "అంతటి నాస్తికుడు మీకు భక్తుడు అవుతాడా?" అంటూ ఆమె చెప్పిన డైలాగ్, కథలోని ప్రధాన పాయింట్‌ను హింట్ ఇచ్చినట్లుగా ఉంది. ఇక విష్ణు తన క్యారెక్టర్‌లో కొన్ని డిఫరెంట్ మోడ్స్ చూపించాడు. "ఇది నా ఆన.. తిన్నడి ఆన.." అంటూ చెప్పిన డైలాగ్, అతని పాత్రలోని బలాన్ని చూపించేలా ఉంది.
కన్నప్ప కథను సరికొత్త తరహాలో ప్రజెంట్ చేస్తూనే మైథలాజికల్ టచ్ ఎక్కడా మిస్సవ్వదని మేకర్స్ టీజర్ తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీజర్ మొత్తాన్ని చూస్తే విజువల్స్ తో న్యూ టచ్ ఇచ్చినట్లు అర్ధమవుతుంది. ఫైట్ సీక్వెన్స్‌లు, గ్రాఫిక్స్ దృశ్యాలు కూడా సినిమాలో ఎక్కువగా ఉన్నట్లు అర్ధమవుతుంది. అయితే పూర్తిస్థాయి థియేట్రికల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది సినిమా విడుదలయ్యాకే తెలియనుంది.
టీజర్ చివర్లో ప్రభాస్ లుక్ హైలైట్‌గా నిలిచింది. ‘కన్నప్ప’లో ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో కనిపించనున్నారు. పెద్దగా డైలాగ్ లేకపోయినా, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే టీజర్‌ను ముగించడం ఆకట్టుకునే అంశంగా మారింది. సినిమా మొత్తంలో ఆయన స్క్రీన్ టైమ్ ఎంత ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక థియేటర్స్‌లో విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. కన్నప్ప ఏప్రిల్ 25న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. మరి సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచిచూడాలి.