హీరో హీరోయిన్ లవ్.. అలా మొదలైంది

తన ప్రేమ గురించి చెబుతూ.. 'రాజావారు రాణిగారు' షూటింగ్ సమయంలోనే తాను హీరోయిన్ రహస్యతో ప్రేమలో పడినట్లు చెప్పారు.

Update: 2024-10-18 04:00 GMT

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు 'క' అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ హీరో కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇక 70వ దశకంలోని విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. సుజీత్, సందీప్ దర్శకత్వం వహించిన క సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా ఈ నెల 31న 'క' చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

కిరణ్ అబ్బవరం తాజాగా ఈ చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన ప్రేమ కథ గురించి మాట్లాడుతూ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కంటెంట్ ఇచ్చాడు. 'షూటింగ్ మొదటి రోజే తనతో ప్రేమలో పడ్డాను' అని కిరణ్ ఓపెన్ గా చెప్పారు. అంతేకాకుండా, ఈ విషయం చాలా కాలం పాటు సీక్రెట్ గా ఉంచినట్లు వెల్లడించారు.

తన ప్రేమ గురించి చెబుతూ.. 'రాజావారు రాణిగారు' షూటింగ్ సమయంలోనే తాను హీరోయిన్ రహస్యతో ప్రేమలో పడినట్లు చెప్పారు. మొదట శ్రేయాభిమానంతో మొదలైన బంధం క్రమేణా స్నేహం లోకి మారి, ఆ తర్వాత ప్రేమగా మారిందని.. రెండేళ్ల అనంతరం ప్రేమ బలంగా పెరిగి ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరిందని అన్నారు. ఇక రహస్యను చూసిన మొదటి క్షణం నుంచే ఆమెపై ఇష్టం పెరిగిందని, ఏదో తెలియని అనుభూతి తనను ఆమె వైపు లాక్కెళ్లిందని కిరణ్ వివరణ ఇచ్చారు.

ఇక ఆగస్టు 22న వీరి వివాహం కర్ణాటకలోని కూర్గ్ లో గ్రాండ్ గా జరిగింది. ప్రేమ కథను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లిన కిరణ్, కుటుంబ సభ్యుల సమక్షంలో, స్నేహితుల మధ్యనే హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు. కిరణ్, రహస్య ఇద్దరూ సాప్ట్‌వేర్ ఇంజినీర్స్ గా తమ ప్రొఫెషనల్ లైఫ్ ను కొనసాగిస్తూనే, షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ తమ నటనపై ఆసక్తిని చూపించారు. అదే ఆసక్తి వారు 'రాజావారు రాణిగారు' చిత్రంలో కథానాయకులు అవ్వడానికి కారణమైంది.

ఇక 'రాజావారు రాణిగారు' చిత్రం వారికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సమయంలోనే వారు నటనపై ఉన్న ప్రేమ మరింత దగ్గరికి తీసుకెళ్లింది. వీరి ప్రేమ కథ కేవలం సినిమాల ద్వారానే కాకుండా, నిజ జీవితంలో కూడా అందరికీ ప్రేరణగా నిలిచింది. సినిమా షూటింగ్స్ లో బిజీ అయినప్పటికీ, ప్రేమను సీక్రెట్ గా ఉంచి, సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఇక 'క' మూవీకి వస్తే, కిరణ్ అబ్బవరం ఇందులో తన నటనలో మరో కొత్త కోణం చూపించబోతున్నారు. 70వ దశకంలో జరిగే కథ, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు మరోసారి వినోదాన్ని అందించబోతోంది.

Tags:    

Similar News