అమ్మకు నాకు 20 ఏళ్ళ దూరం - కిరణ్ అబ్బవరం
‘క’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం తన జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘క’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం తన జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మొదటి సారి కాస్తా ఎమోషనల్ గా తన ప్రయాణం గురించి షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా అమ్మ గురించి కిరణ్ అబ్బవరం చెప్పిన విషయాలు అందరిని భావోద్వేగానికి గురి చేశాయి. ఎక్కడో రాయచోటిలో చిన్న గ్రామం. ఐదో తరగతి వరకు చదువుకుంది. పెళ్లి చేసుకొని పెద్ద కోడి పల్లికి వచ్చింది. చూస్తే పరిస్థితి బాగోలేదు. రోజు ఉదయం లేచిన వెంటనే కూలి పనికి వెళ్ళేది.
మా అన్న నా కంటే ఆరేళ్ళు పెద్ద. అప్పులుండటంతో ఉన్నవన్నీ అమ్మేసింది. చివరికి తాళి బొట్టు ఒకటే ఉంది. మా ఊళ్ళో అందరు గొర్రెలు కాసుకుంటారు. ఎక్కడ నా పిల్లలు కూడా గొర్రెలు కాసుకోవాల్సి వస్తుందో అని మా అమ్మకి భయం వేసింది. నా పిల్లలు ఎలా అయిన చదువుకోవాలని అనుకుంది. ఏదో మొండిధైర్యంతో అక్కడి నుంచి కువైట్ కి వెళ్ళిపోయింది. ఎలా అయిన మా పిల్లలని ఇంగ్లీష్ మీడియం చదివించాలని కువైట్ కి వెళ్లి పని చేసుకుంది.
పాలు తాగే వయస్సులో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను బీటెక్ కి వచ్చే వరకు మా అమ్మతో కనీసం రెండేళ్లు కూడా గడపలేదు. ఆమె కష్టపడి మమ్మల్ని చదివిస్తూ ఉండేది. మా బంధువులలో కాస్తా మర్యాద వచ్చింది. 2002లో రాయచోటిలో ఓ నాలుగు లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంది. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది. నాకిద్దరు కొడుకులు ఉన్నారు కదా బాగా చూసుకుంటారు అనే నమ్మకంతో ఉంది. 2015లో మళ్ళీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. కొనుక్కున్న ఇల్లు అమ్మకానికి పెట్టేసింది.
నేను జాబ్ చేస్తున్నాను. ఏదో సంపాదిస్తున్నాను అనే ఫీలింగ్ తో ఉన్నాను. అమ్మకి మాత్రం మనశ్శాంతి ఉండేది కాదు. అప్పుడు ఆమె చెప్పింది. ఏదైనా సాధించండి అంటూ ఉండేది. అప్పుడు అమ్మ గురించి ఆలోచిస్తే ఏమీ తెలియని వయస్సులో ధైర్యంగా ఎక్కడికో వెళ్లి మమ్మల్ని చదివించింది. అలాంటిది నేనెందుకు చేయలేననే ధైర్యం వచ్చింది. నాన్న గురించి ఎందుకు చెప్పడం లేదంటే ఎస్ఆర్ కల్యాణమండపంలో మొత్తం చూపించేసాను. అందుకే అమ్మ గురించే మాట్లాడుతున్నాను.
నేను హాస్టల్ లో ఉన్నప్పుడు అమ్మ ఫోన్ కోసం రెండు వారాలు వెయిట్ చేస్తూ ఉండేవాడిని, మూడు నిముషాలు మాట్లాడి పెట్టేసేది. ఎదో ఒకటి సాధించాలని అమ్మ చెప్పిన మాటతో చాలా స్ట్రాంగ్ గా నేను ఫిక్స్ అయ్యాను. అమ్మ అంత చేసినపుడు ఫ్యామిలీ కోసం నేనెంత చేయాలనే ధైర్యంతో జాబ్ మానేసాను. మా అమ్మతో ఇవన్నీ డైరెక్ట్ గా చెప్పలేను. అందుకే ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నాను. నా కొడుకు సాధించాడు అని బంధువుల దగ్గర అమ్మ గర్వంగా చెప్పుకోవాలి.
ఆ ఒక్క ఆలోచనతో హైదరాబాద్ లో అడుగుపెట్టాను. నాకు వీలైనంత, నాకు సత్తా ఉన్నంత వరకు షార్ట్ ఫిలిమ్స్ చేసాను. ఏ ఒక్కరిని నాకు సపోర్ట్ చేయండి అని నేను ఎవరిని అడగలేదు. రాజావారు రాణిగారు సినిమా కి మనో వికాస్ అనే ఒక 24 ఏళ్ళ కుర్రాడు నాకు అవకాశం ఇచ్చాడు. ఆ మూవీ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ మండపం మూవీ తీసుకున్నాను. మా బంధువుల సపోర్ట్ తో ఏదో ఒకటి సాధించాలని ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీ చేసాను అంటూ కిరణ్ అబ్బవరం తన లైఫ్ జర్నీ గురించి ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు.