కోలీవుడ్‌లో నంబర్ వన్ హీరో ఎవరు?
రజనీకి వయసైపోయింది. కమల్ హాసన్ ప్రయోగాలకే పరిమితం. విజయ్ సినిమాలు వదిలేస్తున్నాడు.
రజనీకి వయసైపోయింది. కమల్ హాసన్ ప్రయోగాలకే పరిమితం. విజయ్ సినిమాలు వదిలేస్తున్నాడు. ఇలాంటి సమయంలో తమిళనాడులో తదుపరి నంబర్ వన్ స్టార్ ఎవరు? అనే చర్చ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళ తంబీలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు దీని గురించి ఆసక్తికరంగా ముచ్చటించుకుంటున్నారు. తమిళ సూపర్ స్టార్ల సినిమాలు తెలుగులోను రిలీజవుతుండడంతో వారికి ఇక్కడా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఈ ఫాలోయింగ్ ని సద్వినియోగం చేసుకుని పాన్ ఇండియన్ మార్కెట్లోకి తమిళం నుంచి ఎవరు దూసుకొస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగు, కన్నడ, మలయాళంలోను క్రేజ్ పెంచుకునే అర్హత ఏ తమిళ స్టార్ కి ఉందో అర్థం కాని గందరగోళం నెలకొంది.
ప్రస్తుతం ఉన్న స్టార్లలో అజిత్, సూర్య ప్రామిస్సింగ్ స్టార్స్ అనడంలో సందేహం లేదు. రజనీకాంత్ తర్వాత మళ్లీ అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న తళా అజిత్, సూర్య లాంటి స్టార్లు కొన్ని వరుస డిజాస్టర్లతో తమను తాము తగ్గించుకున్నారని విశ్లేషిస్తున్నారు. ఆ ఇద్దరూ ఎంపిక చేసుకుంటున్న కంటెంట్, దర్శకుల విషయంలో అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ఇంతకుముందు కంగువ లాంటి అద్భుతమైన స్పాన్ ఉన్న సినిమా కోసం అంతగా ఆ జానర్ లో పట్టులేని దర్శకుడితో సూర్య పని చేయడం పెద్ద మైనస్ అయిందని విశ్లేషించారు. దరువు శివ మాస్ సినిమాలతో విజయాలు అందుకున్నా కానీ, కంగువ లాంటి వైవిధ్యమైన కంటెంట్ ఉన్న సినిమాని ఆశించిన స్థాయిలో తెరకెక్కించకపోవడంతో భారీ బడ్జెట్ గంగలో పోసిన పన్నీరైంది.
ఆ తర్వాత మరో స్టార్ హీరో అజిత్ అదే బాటలో వెళుతున్నాడంటూ విమర్శలున్నాయి. అజిత్ నటిస్తున్న వరుస సినిమాలు తమిళంలో పెద్ద ఓపెనింగులు సాధిస్తున్నా కానీ, ఇరుగు పొరుగు భాషల్లో సరైన ఓపెనింగులు లేక, ఫ్లాప్ లుగా మారుతుండడం నిరాశపరుస్తోంది. ఇటీవల అజిత్ నుంచి వచ్చిన పట్టుదల తెలుగులో ఫ్లాపైంది. ఈ చిత్రం విదాముయార్చి పేరుతో తమిళంలో ఆరంభ వసూళ్లను తెచ్చినా ఆ తర్వాత అంత పట్టు కొనసాగించలేదు. గతంలో వచ్చిన తెగింపు (తునివు), వాలిమై వంటి చిత్రాలు తెలుగులో డిజాస్టర్లు అయ్యాయి.
నిజానికి తెలుగు ప్రజలు భాషతో సంబంధం లేకుండా స్టార్లను ఆరాధిస్తారు. మంచి కంటెంట్ ఉంటే వారి సినిమాలను ఆదరిస్తారు. అయినా అజిత్, సూర్య లాంటి స్టార్లు దీనిని అందుకోవడంలో పాన్ ఇండియాలో పట్టు సాధించడంలో విఫలమవుతున్నారు. ఇక అజిత్ తో పోలిస్తే సూర్య తన సినిమాలను ఇరుగు పొరుగు మార్కెట్లలోను ప్రమోట్ చేసుకుంటాడు. కానీ అజిత్ అవేవీ పట్టించుకోడు. బహుశా అతడు కార్ రేసింగ్, బైక్ రేసింగ్ లపై చూపించిన ఆసక్తి సినిమాలపై చూపించకపోవడం కూడా ఒక కారణంగా భావించాల్సి ఉంటుంది. అజిత్ ఇటీవలే దుబాయ్ లో కార్ రేసింగ్ లో విజేతగా నిలిచి మరో 8నెలలు గేమ్ కే అంకితమయ్యాడు. దీని కారణంగా కూడా అతడు ప్రమోషన్లకు సమయం కేటాయించలేని స్థితి ఉంది. కేవలం సినిమాలో నటిస్తే సరిపోదు.. సరైన ప్రమోషన్స్ కోసం అజిత్ వ్యూహాల్ని మార్చాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇక హీరో సూర్య ఉత్తమ మైన దర్శకుల్ని ఎంపిక చేసుకోవడం ద్వారా తన పరాజయాల నుంచి బయటపడతాడని కూడా అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం నంబర్ వన్ స్థానాన్ని అందుకునే శక్తి తమిళ హీరోల్లో ఎవరికి ఉంది? అన్నది వేచి చూడాలి. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో, సూర్య రెట్రో, రోలెక్స్ చిత్రాలతో తిరిగి కంబ్యాక్ అవుతారేమో చూడాలి.