'కల్కి' కి మాస్‌ రెస్పాన్స్ ఓకేనా?

మాస్ ప్రేక్షకులు బాగా ఉన్న సీడెడ్ ఏరియాలో 'కల్కి' వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. తొలి రోజు 'కల్కి' రేంజ్ మూవీ 10 కోట్ల మార్కును టచ్ చేయాల్సింది.

Update: 2024-06-29 03:53 GMT

భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి సినిమాకు ఉన్నంతలో బెటర్ టాకే వచ్చింది. రివ్యూల్లో రేటింగ్ సగటున 3 పడింది. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది. సినిమాలో లోపాల గురించి మాట్లాడుతున్న వారు కూడా ఇది మస్ట్ వాచ్ అనే అంటున్నారు. సినిమా చూడొద్దని చెబుతున్న వారే కనిపించడం లేదు.

'కల్కి'కి అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరగడం వల్ల వీకెండ్ ఓపెనింగ్స్‌కు ఢోకాయే లేని పరిస్థితి. తొలి రోజే ఈ చిత్రం రూ.191 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ వసూళ్లు మరీ ఎగ్జాజరేట్ చేసినట్లు కూడా అనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్.. నిన్న థియేటర్ల దగ్గర సందడి చూస్తే ఆ స్థాయి వసూళ్లు రావడంలో ఆశ్చర్యమేమీ లేదనిపిస్తోంది. ఐతే ఈ సినిమాకు సోషల్ మీడియాలో లేని మాస్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన ఉంది.. వారి అభిప్రాయం ఏంటి అన్నది కీలకంగా మారింది.

పెద్దగా చదువుకోని.. సోషల్ మీడియాలో, మీడియాలో కనిపించని ప్రేక్షకుల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటుంది. ఆ వర్గం ప్రేక్షకులు ఓ సినిమాను ఎలా ఆదరిస్తారన్న దాన్ని బట్టే సినిమా అంతిమ ఫలితం ఆధారపడి ఉంటుంది. వసూళ్లు పెరుగుతాయి. 'కల్కి' విషయంలో ఆ ప్రేక్షకుల నుంచి కొంచెం మిశ్రమ స్పందనే వస్తున్నట్లు కనిపిస్తోంది.

మాస్ ప్రేక్షకులు బాగా ఉన్న సీడెడ్ ఏరియాలో 'కల్కి' వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. తొలి రోజు 'కల్కి' రేంజ్ మూవీ 10 కోట్ల మార్కును టచ్ చేయాల్సింది. కానీ వసూళ్లు 7 కోట్లకు అటు ఇటుగా వచ్చినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు.

అంటే 'కల్కి' వారిని పూర్తిగా ఎగ్జైట్ చేయలేదని తెలుస్తోంది. కొంతమేర వర్షాలు కూడా ప్రభావం చూపి ఉండొచ్చు కానీ.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాల స్థాయిలో 'కల్కి' మాస్‌కు పూర్తి సంతృప్తిని ఇవ్వడం లేదని.. వారికి ఈ కథను అర్థం చేసుకోవడం కష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీకెండ్ తర్వాత 'కల్కి'కి మాస్ నుంచి రెస్పాన్స్, ఓవరాల్ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News