సైఫ్ దాడి కేసులో సెన్సేషన్ కోసం పాకులాట
వ్యూస్ కోసం.. లైక్‌ల కోసం వార్తలో నిజాలను ఖూనీ చేయడం నేటి ఆధునిక మీడియాలో నిత్యం చూస్తున్నదే.
వ్యూస్ కోసం.. లైక్‌ల కోసం వార్తలో నిజాలను ఖూనీ చేయడం నేటి ఆధునిక మీడియాలో నిత్యం చూస్తున్నదే. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన డిజిటల్ మీడియాలు, యూట్యూబ్ చానెళ్లలో ఎవరికి వారు ఇష్టానుసారం కథనాలను వేయడం ద్వారా చాలా కేసుల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి. అయితే పాపులర్ దినపత్రికకు చెందిన టీవీ చానెల్ కథనంలో కూడా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో తప్పు దారి పట్టించే కథనం రావడం ఆశ్చర్యపరిచింది.
సదరు కథనం ప్రకారం... సైఫ్ తన ఇంట్లో పని చేస్తున్న పని మనిషితో ఎఫైర్ పెట్టుకున్నాడని, అది నచ్చకే ఆమె బోయ్ ఫ్రెండ్ సైఫ్ పై దాడి చేసి పారిపోయాడని, అతడే సైఫ్ కార్ డ్రైవర్ కనుక ఆటోలో సైఫ్ ఆస్పత్రికి చేరుకున్నాడని సదరు కథనంలో వేసారు.
నిజానికి సైఫ్ ఖాన్ దాడి కేసులో పోలీసులు పరిశోధించి నిజాలను నిగ్గు తేల్చకుండానే ఇలాంటి తప్పుడు కథనం వేయడం ఆశ్చర్యపరిచింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఊహాజనిత కథనాలు వండి వార్చడం ద్వారా సమాజానికి సదరు వార్తా చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు ఏం చెప్పదలిచాయో అర్థం కాని వ్యవహారంగా మారింది.
ఇదొక్కటే కాదు... సైఫ్ ఖాన్ ని ఆస్పత్రికి చేర్చింది అతడి పెద్ద కొడుకు ఇబ్రహీం అని ఒకసారి, కాదు తైమూర్ అలీఖాన్ అంటూ ఇంకోసారి యూట్యూబ్ చానెళ్లు కన్ఫ్యూజ్ చేసాయి. దీనికి తోడు కరీనా కపూర్ ఖాన్ భర్తపై దుండగుడి దాడి సమయంలో మందు పార్టీలో ఉందని, పార్టీలో మునిగి తేలిందని, భర్తకు అంత పెద్ద ప్రమాదం జరిగితే తన వెంట ఆస్పత్రికి ఎందుకు రాలేకపోయింది? అంటూ కొన్ని చానెళ్లు ప్రశ్నిస్తూ కథనాలను వండి వార్చాయి. అయితే ఎలాంటి ఊహాగానాలకు మీడియా తావివ్వొద్దని కరీనా తన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు.
అయితే వ్యూస్ కోసం, లైక్ లు, క్లిక్స్ కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మీడియా ద్వంద్వ వైఖరిని స్పష్ఠం చేస్తోంది. ఇలాంటి సున్నిత విషయాల్లో ఏదైనా కథనం వేసే ముందు మీడియా ప్రతినిధులు నేరుగా అటువైపు వారిని సంప్రదించి ప్రతిదీ కన్ఫామ్ చేసుకున్నాకే వార్తను వేయాలి. కానీ అలా కాకుండా ఇటీవల ఊహాజనిత కథనాలు అల్లేయడంతో మీడియాలు చిక్కుల్లో పడేస్తున్నాయి. అసల ఏది నమ్మాలి? ఏది నమ్మకూడదు? అనే డైలమా మీడియాలోను నెలకొంటోంది.