అలా చేస్తేనే బాలీవుడ్ డెవలప్ అవుతుంది
సౌత్ లో సక్సెస్ రేటు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కూడా సౌత్ ఇండస్ట్రీలోకి వచ్చి నటించాలని చూస్తున్నారు.;

ఒకప్పుడు ఇండియన్ సినిమాను ఏలే పరిశ్రమగా బాలీవుడ్ తప్ప మరేదీ కనిపించేది కాదన్నట్టు బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ప్రవర్తించేవారు. దానికి తోడు అప్పట్లో బాలీవుడ్ లో సినిమాలు కూడా ఆ రేంజ్ లోనే ఉండేవి. అక్కడ సక్సెస్ రేటు కూడా ఎక్కువ ఉండేది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు బాలీవుడ్ లో సక్సెస్ రేటు బాగా తగ్గిందనేది అందరి నుంచి వినిపిస్తున్న మాట.
మారుతున్న ట్రెండ్ ను బట్టి దర్శకులు కూడా అప్డేట్ అవాలి. ఆడియన్స్ కు నచ్చే కంటెంట్ తో సినిమాలు చేయాలి. బాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు తగ్గాయి కాబట్టే నార్త్ ఆడియన్స్ కు సౌత్ సినిమాలు విపరీతంగా నచ్చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మాస్ సినిమాలంటే చాలు నార్త్ ఆడియన్స్ పడి చచ్చిపోతున్నారు.
సౌత్ లో సక్సెస్ రేటు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కూడా సౌత్ ఇండస్ట్రీలోకి వచ్చి నటించాలని చూస్తున్నారు. ఆల్రెడీ బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ కు గుడ్ బై చెప్పి సౌత్ లో సెటిలైపోయినట్టు ప్రకటించగా, రీసెంట్ గా సన్నీ డియోల్ కూడా తనకు సౌత్ లో సెటిల్ అవాలనుందని వెల్లడించారు. సౌత్ లో నటీనటులకు చాలా గౌరవమిస్తారని, సినిమాలు ఎలా తీయాలో సౌత్ వాళ్లకు బాగా తెలుసని, వారిని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలని సన్నీ డియోల్ అన్న విషయం తెలిసిందే.
ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహం తనకు హిందీ చిత్ర పరిశ్రమను చూస్తుంటే కంగారుగా ఉందని అన్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన బాలీవుడ్ సినిమాలపై సోషల్ మీడియాలో ఎక్కువగా విమర్శలు వస్తున్నాయని, అవన్నీ చూసి బాలీవుడ్ కు చెందిన వ్యక్తిగా తానెంతో ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు.
బాలీవుడ్ లో కొత్తగా ట్రై చేయాలనుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారని, తన లాంటి కమర్షియల్ హీరోలు కూడా కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా డిఫరెంట్ కథలతో కూడా సినిమాలు చేయాలని, ఎప్పుడూ కొత్తదనం ఉండాలని, అప్పుడే ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని, మనం మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రతీరోజూ ఎవరొకరు మన ఇండస్ట్రీని విమర్శిస్తుండటంతో బాధ కలుగుతుందని జాన్ అబ్రహం చెప్పారు.