"అందరికీ నమస్కారం"...మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!
గత నాలుగు రోజులుగా మంచు కుటుంబంలోని వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే.
గత నాలుగు రోజులుగా మంచు కుటుంబంలోని వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఆదివారం మీడియాలో చిన్న చిన్న చినుకులుగా మొదలైన ఈ వ్యవహారం మంగళవారం రాత్రికి పెను తుఫానుగా మారిందనే చర్చ జరిగింది. ఈ క్రమంలో ఎన్నో బ్రేకింగ్ న్యూస్ లు, మరెన్నో గాసిప్పులు, ఇంకెన్నో ఫిర్యాదులు, చాలా ఉద్రిక్తతలు!
ఇలా సుమారు నాలుగు రోజులుగా మోహన్ బాబు ఇంటి వ్యవహారం మీడియాలోనూ, ఇండస్ట్రీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. మరోపక్క మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు గురువారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు! ఈ సమయంలో... మోహన్ బాబు కి సంబంధించిన ఓ ఆడియో ఫైల్ తెరపైకి వచ్చింది!
అవును... "అందరికీ నమస్కారం" అంటూ మోహన్ బాబు గంభీరమైన వాయిస్ తో ఓ ఆడియో విడుదలైంది! అందులో మోహన్ బాబు ఏమి మాట్లాడరనేది ఆయన మాటల్లోనే...
"అందరికీ నమస్కారం.. రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు.. భారత దేశంలోనూ, యావత్ ప్రపంచంలోనూ ఉన్న తెలుగు, మిగతా భాషలలోని అభిమానులకు.. నా శ్రేయోభిలాషులకు.. ఆత్మీయులకు.. ప్రజా ప్రతినిధులకు.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు.. మీడియా ప్రతినిధులకు.. నా హృదయపూర్వక నమస్కారాలు"!
"గత నాలుగు రోజులుగా ఏవేవి జరుగుతున్నదనేది అందరికీ తెలుసు.. ముఖ్యమంత్రులకు కూడా తెలిసి ఉంటుంది.. వాళ్లు ఎన్నో సమస్యలతో తలమునకలై ఉంటారు.. అయితే, పర్సనల్ సెక్రటరీలు చెప్పి ఉండొచ్చు! నా హృదయంలో ఉండే ఆవేదన ఏమిటంటే... కుటుంబ సమస్యల్లో పర్మిషన్ లేకుండా ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా..? మీరే ఆలోచించాలి! "
"నూటికి నూరు శాతం అనాల్సిన అవసరం లేదు కానీ.. కనీసం 95% కుటుంబ సమస్యలు ఉంటుంటాయి. అయితే మేమంతా నటులం కాబట్టి మా విషయాలు, పాపులర్ అయిన రాజకీయ నాయకుల విషయాలు.. కొంతమంది ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చెబుతుంటారు.. చెప్పేవాళ్లు కూడా ఆలోచించుకోవాలి.. ఇది వాళ్ల కుటుంబ సమస్య అని!"
"ఇప్పుడు ప్రజలు కూడా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం.. టీవీలో వస్తున్న విజువల్స్ చూడండి.. సోషల్ మీడియాలో వస్తున్నవి చూడండి.. రాత్రి ఎన్ని గంటలకు నా బిడ్డ మనోజ్ వచ్చాడు.. అది రైటా రాంగా అది పర్సనల్ విషయం! తర్వాత మాట్లాడదాం.."
"పత్రికా సోదరులు నాలుగు రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని, వ్యాన్ లు పెట్టుకుని, అలా ఉండటం ఎంతవరకూ న్యాయం?.. అప్పటికీ బయటకు పోతున్నప్పుడు చెప్పాను.. అందరికీ నమస్కారమయ్యా.. ఇది నా కుటుంబ వ్యవహారం, మీకూ కుటుంబాలు ఉన్నాయి, దీన్ని చిలవలు పలవలు చేయొద్దండి.. దయచేసి నన్ను గౌరవించండని!"
"నేను నటుడిగా, రాజ్యసభ సభ్యుడిగా మీకు తెలుసు ఎంత క్లీన్ చీట్ గా ఉన్నానో. ఈ రోజున మీడియా సోదరులు ఎంత కల్పితాలు, ఎంత నెగిటివిటీ నా గురించి చెబుతున్నారో మీ అందరికీ తెలుసు. దానికి నేను బాధపడటం లేదు.. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది.. రాత్రుళ్లు గేటు తోసుకుని, గేటు పగలగొట్టి, పర్మిషన్ లేకుండా ఎవరైనా రావొచ్చా..?
"వచ్చిన వాళ్లు అందరూ మీడియా సోదరులా.. లేక, ఇంకెవరైనా నా మీద రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతిలో పెట్టుకుని అలా వచ్చి ఉంటారేమోనని సందేహం. అంతే తప్ప జర్నలిస్టులను కొట్టాలని తాను మనసావాచా దైవసాక్షిగా అలా ఆలోచించేవాడిని కాదు. ఎందుకంటే.. వాళ్లూ ఉద్యోగస్తులు, నేనూ ఉద్యోగస్తుడినే.. భగవంతుడు ఇస్తుంటాడు మనకు కూలి"!
"ముందు నేను నమస్కారం పెట్టా.. నేను అతడిని కొట్టామనే చెబుతున్నారు తప్ప.. మైకు నోట్లో పెట్టారు.. నా కన్ను పోవాల్సింది.. నా కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి.. కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద.. నేనే ఎస్కేప్ అయ్యాను.. లేకపోతే నా జీవితం గుడ్డిది అయ్యేది!"
"మైకు లాక్కోవడం, కేకలెయ్యడం, నేను కొట్టిన దెబ్బ అతడికి తగిలి ఉండొచ్చు.. తగిలిందన్నారు.. అందుకు హృదయపూర్వకంగా బాధ పడుతున్నాను.. అతడూ నాకు తమ్ముడే.. ఈ రోజుకీ నేను బాధపడుతున్నాను.. అయ్యో అతని భార్య, పిల్లలు ఎంత బాధపడుతున్నారో అని నేను ఆలోచిస్తున్నాను.. సినిమాలో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదు"!
"నాకు ఉన్నది ఒకటే ఒక ధైర్యం, సాహసం!.. నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతకాలన్నదే నా ఆలోచన.. వాళ్లు గేటు బయట ఉన్నప్పుడు నేను కొట్టి ఉంటే నాపై 50 కాకపోతే 100 కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు.. లేకపోతే.. నేనే పోలీస్ స్టేషన్ కు పోయి.. ఇలా కొట్టాను అని చెబుతాను!"
"కానీ.. నా ఇంటి లోపలకు వచ్చి.. నా ఏకాగ్రతను, నా మనశ్శాంతిని భగ్నం చేశారు.. ఆల్రెడీ నా బిడ్డ చేస్తున్నాడు.. అయినా నేను కన్న బిడ్డ, ఏదో ఒకరోజు కూర్చుని మాట్లాడుకుంటాం.. దీనికి మధ్యవర్తులు అక్కరలేదు. కట్టుబట్టలతో మద్రాసు వెళ్లినవాడిని..!"
"కష్టపడి సంపాదించి.. ఈ రోజు కులమతాలకు అతీతంగా 25% ఉచిత విద్యను అందిస్తూ, నా వంతు సహాయం చేసుకుంటూ ఉన్నాను. అన్నయ్య (ఎన్టీఆర్) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో చేశాను. ఈ రోజు కొట్టింది కొట్టిందే మాట్లాడుతున్నారు. ప్రజా ప్రతినిధులారా.. నా అభిమానులారా.. తెలుగు ప్రజలారా.. తమిళ, కన్నడ, మలయాళ అభిమానుల్లారా ఆలోచించండి!"
"నేను కొట్టినది తప్పు.. ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చింది..? మీ ఇంట్లోకి దూరితే ఒప్పుకుంటారా.. మీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తే ఒప్పుకుంటారా.. మీరే ఆలోచించండి! మీడియా ప్రతినిధుల ఇల్లల్లోకి వారు రాసిన విషయాలపై పది మంది వెళ్లి నిలదీస్తే.. దండం పెట్టి పంపిస్తారా..? మీకు టీవీలు ఉన్నాయి.. మాకు టీవీలు లేవు!"
"నేను కూడా రేపు టీవీ ఛానల్ పెట్టొచ్చు.. అది కాదు గొప్ప. నేను అతనికి గాయమైనదానికి చాలా చింతిస్తున్నాను.. చింతించి లాభమేమిటంటే... మీరు చేసిందేమిటి..? మళ్లీ మళ్లీ చెబుతున్నా.. అసలు అతను నిజంగా జర్నలిస్టా.. కాదా.. అని ఆ చీకట్లో ఎలా తెలుస్తుంది..? టీవీ9 అని నాకు ఎలా తెలుస్తుంది..? ఆ టైం లో కంటి మీదకు మైకు వచ్చింది.. దాన్ని లాక్కున్నాను."
"ఇది అసత్యం కాదు.. అది టీవీ9 ఆ.. టీవీ9 మైకునే లాక్కోవాలి.. ఏమిటండి.. నేనేమైనా మూర్ఖుడినా..? నలుగురైదుగురు జర్నలిస్టు సోదరీమణులు మాట్లాడారు.. కొట్టడం తప్పైనా, ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చింది.. అనేది క్లియర్ గా మాట్లాడారు.. అవన్నీ మీరు చెప్పరు! అయినా.. భగవంతుడు చూస్తున్నాడు!"
"పోలీస్ అంటే నాకు ఇష్టం.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వాళ్లది.. నా విద్యాలయం నుంచి కూడా ఐఏఎస్, ఐపీఎస్ లు అయిన విద్యార్ధినీ విద్యార్థులు ఉన్నారు. వాళ్లకు న్యాయం, ధర్మం నేర్పించి పంపించాను నా ఇనిస్టిట్యూట్స్ నుంచి. వాళ్లంతా న్యాయంగానే ఉన్నారు కదా?"
"కానీ ఇక్కడ మాత్రం ఏకపక్ష నిర్ణయం.. ఏమి చేస్తున్నారో ప్రజలారా మీరే ఆలోచించండి.. నేను చేసింది న్యాయమా అన్యాయమా.. మీరే ఆలోచించండి. నా ఇంటి గేటు బద్దలుకొట్టి రావడం న్యాయమా.. మీరే చెప్పండి. ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకునే మీ మోహన్ బాబు.. నమస్కారం"!