మోహన్‌లాల్ ఎల్2.. ఫైనల్ గా ఓ క్లారిటీ వచ్చేసింది

మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ హీరోగా వస్తున్న ఎల్2 ఎంపురాన్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.;

Update: 2025-03-16 11:36 GMT

మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ హీరోగా వస్తున్న ఎల్2 ఎంపురాన్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ మాస్ పొలిటికల్ థ్రిల్లర్ మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న అనుమానాలు చివరి దశలో క్లారిటీకి వచ్చాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మొదట లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చివరి క్షణంలో గోకులన్ సంస్థ రంగంలోకి దిగింది. దీంతో రిలీజ్ సమస్య పూర్తిగా పరిష్కారమై, సినిమాకు మార్గం సుగమమైంది.


సినిమా కథ, మేకింగ్‌లో ఏ మాత్రం రాజీపడకుండా దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ సినిమాను భారీ స్థాయిలో డిజైన్ చేసినట్లు సమాచారం. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడేలా ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ బజ్ తక్కువగా ఉన్నప్పటికీ, అనూహ్యంగా చిత్రబృందం గేర్ మార్చి ప్రమోషన్ల స్పీడ్ పెంచింది. మోహన్‌లాల్ పవర్‌ఫుల్ లీడర్‌గా కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన పాత్రకు తగ్గట్టుగా ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్, పొలిటికల్ డ్రామా, యాక్షన్ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా రిలీజ్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఉదయం 6 గంటల నుంచే ఫస్ట్ షోలు ప్లాన్ చేస్తున్నారు. కేరళలో ఇది సాధారణం అయినప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో కూడా తెల్లవారు జామునే ప్రీమియర్లు ప్లాన్ చేయడం సినిమాపై ఉన్న భారీ నమ్మకాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్ల కోసం మంచి రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, సినిమా ప్రమోషన్‌లో భాగంగా తొలి భాగమైన లూసిఫర్ చిత్రాన్ని మళ్లీ మార్చి 20న థియేటర్లలో విడుదల చేయనున్నారు. చిరంజీవి ఈ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసినప్పటికీ, ఒరిజినల్ లూసిఫర్‌కు వచ్చిన స్థాయిలో ఆ సినిమా హైప్ సాధించలేకపోయింది. మలయాళం మార్కెట్‌లో ‘ఎల్2 ఎంపురాన్’ హైప్ భారీగా ఉంది. అయితే ఇతర భాషల్లోను ఈ సినిమాను ఎలాంటి ప్రమోషన్లతో ప్రేక్షకులకు చేరువ చేస్తారనేదే ఆసక్తికరంగా మారింది.

హై లెవెల్ మేకింగ్, మోహన్‌లాల్ పవర్‌ఫుల్ క్యారెక్టర్, పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా ఉండటంతో పెద్ద ఎత్తున మాస్ ఆడియన్స్ ఆకర్షితులవుతారని అంటున్నారు. అయితే ఈ సినిమా వాస్తవానికి మూడేళ్ల కిందటే ప్రారంభమై, మధ్యలోనే విడుదల అనుమానాల్లో పడిపోయింది. చివరికి నిర్మాతల మార్పుతో సినిమా థియేటర్ల బాట పట్టనుంది. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన మరో ముఖ్యాంశం ఏమిటంటే, అదే రోజున తమిళ నటుడు విక్రమ్ వీరధీర శూర 2 కూడా విడుదల అవుతోంది.

ఇక మార్చి 28న నితిన్ రాబిన్ హుడ్, సితార ఎంటర్టైన్మెంట్స్ మ్యాడ్ స్క్వేర్ సినిమాలు రేస్‌లోకి దిగుతున్నాయి. అంటే ఒక్కసారిగా మార్కెట్‌లో పోటీ పెరిగేలా కనిపిస్తోంది. మరి ఈ కాంపిటిషన్‌ను ఎల్2 ఎంపురాన్ ఎలా ఎదుర్కొంటుందనేది చూడాలి. దర్శకుడు పృథ్విరాజ్ ఇప్పటికే తెలుగు, తమిళ పరిశ్రమల్లో మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు. ఇదే ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాదులో ప్రత్యేకంగా ఒక ఈవెంట్ ప్లాన్ చేశారట.

ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్ర పోషించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఆయన ‘సలార్’లో విలన్‌గా నటించిన తరువాత మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ‘ఎల్2 ఎంపురాన్’ ప్రమోషన్ కోసం ఆయన హైదరాబాద్‌కు రావడం, తద్వారా సౌత్ మార్కెట్‌లో మరింతగా రీచ్ పెంచుకోవడం జరుగనుంది. అంతా అనుకున్నట్టుగా జరిస్తే ఈ సినిమా మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది. ఇక సినిమా థియేట్రికల్ రన్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News