సమంతతో సినిమా చేయడం లేదు..!

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇటీవల దర్శకురాలు నందిని రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.;

Update: 2025-03-05 10:43 GMT

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇటీవల దర్శకురాలు నందిని రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. నందిని రెడ్డికి బర్త్‌ డే శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటాను, మీతో వర్క్‌ను ఆస్వాదిస్తాను అన్నట్లుగా పోస్ట్‌ పెట్టారు. దాంతో మరోసారి నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత సినిమా చేయబోతుందనే వార్తలు మొదలు అయ్యాయి. సమంత, నందిని రెడ్డి మూవీ పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేశాయి. దాంతో దర్శకురాలు నందిని రెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయమై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో నందిని రెడ్డి మాట్లాడుతూ... నేను త్వరలో చేయబోతున్న సినిమా రీమేక్‌ కానే కాదు. ఒరిజినల్‌ స్క్రిప్ట్‌తోనే సినిమాను చేయబోతున్నాను. అలాగే సమంతతో కొత్త సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు సైతం నిజం కాదు. అవి పూర్తిగా పుకార్లు మాత్రమే. ఒకవేళ సమంతతో సినిమా కన్ఫర్మ్‌ అయితే నేను సంతోషంగా ప్రకటిస్తాం. సమంతతో సినిమా అంటే గర్వంగా ఉంటుంది, ఆ సినిమాను గర్వంగా ప్రకటించుకుంటాను అంది. సమంతతో తాను సినిమా చేయబోతున్నట్లు వచ్చిన పుకార్లకు తాను ఐదుకు ఒక్క మార్కు ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది. దయచేసి ఇలాంటి పుకార్లను పుట్టించవద్దని, ఒకటి మాట్లాడితే మరోటి అర్థం చేసుకోవద్దని నందిని రెడ్డి కోరింది.

సమంత, నందిని రెడ్డి మధ్య స్నేహం ఉంది. ఇద్దరు గతంలో సినిమాలు చేసిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో జబర్దస్త్‌, ఓ బేబీ సినిమాలు వచ్చాయి. జబర్దస్త్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలవగా, ఓ బేబీ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు సొంతం అయ్యాయి. ఓ బేబీ సినిమా తర్వాత తెలుగులో సమంత సినిమాల సంఖ్య తగ్గించింది. ముఖ్యంగా నాగ చైతన్య నుంచి విడి పోయిన తర్వాత టాలీవుడ్‌లో సినిమాలకు పెద్దగా ఓకే చెప్పడం లేదు. తెలుగులో సమంత చివరగా యశోద సినిమాలో కనిపించిన విషయం తెల్సిందే.

మయో సైటిస్ అనారోగ్య సమస్యల కారణంగా సమంత దాదాపు ఏడాది పాటు పూర్తిగా షూటింగ్స్‌ను పక్కన పెట్టారు. ఇటీవలే తిరిగి కొత్త ప్రాజెక్ట్‌లు మొదలు పెట్టింది. మా ఇంటి బంగారం అనే విభిన్నమైన సినిమాను సమంత కమిట్‌ అయింది. ఆ సినిమా ఎక్కడి వరకు వచ్చింది అనే విషయం లో క్లారిటీ లేదు. మరో వైపు సిటాడెల్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మరో వెబ్‌ సిరీస్‌కి సిద్ధం అయింది. రక్త్‌ బ్రహ్మాండ్‌ అనే వెబ్‌ సిరీస్‌లో సమంత కీలక పాత్రలో కనిపించబోతుంది. మరో వైపు ఫ్యామిలీ మ్యాన్‌ 3లోనూ సమంత నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవల సమంత ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఆ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News